WTC: ఫైనల్‌ జరిగేది ఎక్కడో తెలుసా?

8 Mar, 2021 17:59 IST|Sakshi

ముంబై: భారత్‌, న్యూజిలాండ్ జట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న ప్రపంచ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ (డ‌బ్ల్యూటీసీ) ఫైన‌ల్‌ వేదిక మారనుంది. తొలుత ఈ మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకమైన లార్డ్స్ మైదానంలో నిర్వహించాలని ఐసీసీ భావించినప్పటికీ.. వివిధ కారణాల చేత వేదికను సౌథాంప్టన్‌కు మార్చాలని నిర్ణయించినట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌర‌వ్ గంగూలీ వెల్లడించారు. అయితే ఈ అంశంపై ఐసీసీ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి వేదిక మార్పు అంశం ఐసీసీ పరిధిలో ఉంటుంది. కానీ బీసీసీఐ అధ్యక్షుడు ఐసీసీతో ఎటువంటి సంప్రదింపులు జరుపకుండా ఏకపక్ష నిర్ణయాన్ని వెల్లడించడం పలు సందేహాలకు తావిస్తుంది. ప్రపంచ క్రికెట్‌కు పెద్దన్నలా వ్యవహరిస్తున్న బీసీసీఐ ఏ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

అయితే లండ‌న్‌లో పెరిగిపోతున్న క‌రోనా కేసుల కార‌ణంగానే వేదిక‌ను లార్డ్స్ నుంచి సౌథాంప్టన్‌కు త‌ర‌లించారని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. భారత్‌, న్యూజిలాండ్‌ల మ‌ధ్య సౌథాంప్టన్‌లో జ‌ర‌గ‌బోయే ఫైన‌ల్ మ్యాచ్‌కు వెళ్లాల‌ని నిర్ణయించుకున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ వెల్లడించాడు. ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ.. ప్రపంచ టెస్ట్‌ చాంపియన్షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ప్రశాంతమైన వాతావరణంలో జరగాలని కోరుకుంటున్నామని, అందులో భాగంగానే వేదికను మార్చాల్సి వచ్చిందని వివరణ ఇచ్చాడు. క‌రోనా మ‌హమ్మారి కార‌ణంగా డ‌బ్ల్యూటీసీ మ్యాచ్‌లు క్లిష్ట పరిస్థితుల్లో సాగాయన్నాడు. ఫైన‌ల్లో టీమిండియా న్యూజిలాండ్‌పై గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 
 

మరిన్ని వార్తలు