Nikhat Zareen-Mary Kom: కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు.. తిట్టిన నోరు మెచ్చుకునేలా చేసింది

25 May, 2022 16:45 IST|Sakshi

కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని చెప్పడానికి ఇప్పుడు చెప్పుకునే సంఘటన ఒక నిదర్శనం. ఒకప్పుడు మెచ్చుకోవడానికి రాని నోరు.. ఇవాళ ప్రశంసలు కురిపించేలా చేసింది. ఏ చేతులైతే షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడానికి నిరాకరించాయో అవే చేతులు ఇవాళ ఆమె భుజంపై చేతులు వేసి ఫోటో దిగేలా చేశాయి. ఈ పాటికే మీకు అర్థమయిదనుకుంటా ఎవరా వ్యక్తి అని.. అవునండి.. ఆమె భారత దిగ్గజ మహిళ బాక్సర్‌ మెరీ కోమ్‌. మేరీ కోమ్‌ చేత మెచ్చుకొని ఫోటో దిగిన వ్యక్తి పేరు నిఖత్‌ జరీన్‌.

ఇటీవల జరిగిన ప్రపంచ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం పతకం సాధించి అందరి దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకుంది తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్‌ జరీన్‌. భారత్‌ తరఫున ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఐదో మహిళా బాక్సర్‌గా నిఖత్‌ జరీన్‌ రికార్డులకెక్కింది. మేరీకోమ్‌ చివరి సారిగా 2018లో గెలిచాకా మళ్లీ నాలుగేళ్ల తర్వాత ప్రపంచ బాక్సింగ్‌ వేదికపై తెలుగుతేజం భారత మువ్వన్నెలను సగర్వంగా రెపరెప లాడించింది. అయితే నిఖత్‌ జరీన్‌కు మేరీకోమ్‌ అంటే విపరీతమైన అభిమానం.

మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఆరుసార్లు చాంపియన్‌గా నిలిచిన మేరీ కోమ్‌ అంటే తనకు ఆదర్శమని నిఖత్‌ చాలాసార్లు చెప్పుకొచ్చింది. తనకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడానికి నిరాకరించిన వ్యక్తిని నిఖత్‌ జరీన్‌ స్వయంగా కలుసుకుంది. అయితే మేరీ కోమ్‌ పాత గొడవలన్నీ మరిచిపోయి నిఖత్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. తన సంతోషాన్ని పంచుకున్న నిఖత్‌ ఆమెతో దిగిన ఫోటోను ట్విటర్‌లో పంచుకుంది. నిఖత్‌ పోస్ట్‌ చేసిన మరుక్షణంలోనే సోషల్‌ మీడియాలో ఆ ఫోటో వైరల్‌గా మారింది. అంతకముందే మేరీ కోమ్‌ నిఖత్‌కు శుభాకాంక్షలు చేస్తూ ట్వీట్‌ చేసింది.'' గోల్డ్‌ మెడల్‌ గెలిచినందుకు కంగ్రాట్స్‌ నిఖత్‌ జరీన్‌. నీ ప్రదర్శన చారిత్రాత్మకం.. ఎంతో గర్వంగా ఉంది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా'' అంటూ ట్వీట్‌ చేసింది.

ఇద్దరి మధ్య వివాదం..
నిఖత్‌ జరీన్‌ ఎవరు’... తనతో పోటీకి సై అన్న ఒక యువ బాక్సర్‌ గురించి మేరీ కోమ్‌ చేసిన వ్యాఖ్య ఇది. టోక్యో ఒలింపిక్స్‌కు తనకు నేరుగా అర్హత ఇవ్వాలంటూ మేరీ కోమ్‌ కోరగా, ట్రయల్స్‌లో ఆమెతో తలపడేందుకు అవకాశం ఇవ్వాలని నిఖత్‌ విజ్ఞప్తి చేసింది. చివరకు నిఖత్‌ విజ్ఞప్తి చెల్లగా...మేరీకోమ్‌ చేతిలో మాత్రం ఓటమి ఎదురైంది. కనీసం క్రీడాస్ఫూర్తితో షేక్‌ హ్యాండ్‌ కూడా ఇవ్వకుండా మేరీ తన ఆగ్రహాన్ని ప్రదర్శించింది. ''నేను ఎందుకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వాలి? ఒకవేళ ఆమెకు గౌరవం కావాలంటే ముందు జూనియర్‌గా తనే ఇవ్వడం నేర్చుకోవాలి. అలాంటి వారిని నేను అంతగా ఇష్టపడను. కేవలం నీ సత్తా ఏంటో రింగ్‌లో నిరూపించుకో.. అంతేకానీ బయట ప్రపంచంలో కాదు'' అంటూ ఆగ్రహంతో పేర్కొనడం విమర్శలకు దారి తీసింది.

చదవండి: World Boxing Championship: ప్రతికూలతలను బద్దలు కొట్టి...

Nikhat Zareen: జగజ్జేత నిఖత్‌ జరీన్‌

మరిన్ని వార్తలు