Anshu Malik: భారత తొలి మహిళా రెజ్లర్‌గా సరికొత్త చరిత్ర!

8 Oct, 2021 07:51 IST|Sakshi

Anshu Malik First Indian Woman Win Silver Medal: ప్రపంచ సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో స్వర్ణం గెలిచిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించాలని ఆశించిన అన్షు మలిక్‌కు నిరాశ ఎదురైంది. గురువారం జరిగిన మహిళల 57 కేజీల ఫైనల్లో 20 ఏళ్ల అన్షు ‘బై ఫాల్‌’ పద్ధతిలో టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత, 2016 రియో ఒలింపిక్స్‌ చాంపియన్‌ హెలెన్‌ లూయిస్‌ మరూలీస్‌ (అమెరికా) చేతిలో ఓడిపోయింది. తొలి విరామానికి 1–0తో అన్షు ఆధిక్యంలో నిలిచింది. అయితే రెండో భాగం ఆరంభంలోనే హెలెన్‌ 2 పాయింట్లతో ఆధిక్యంలోకి వచ్చింది.

ఆ తర్వాత మరో రెండు పాయింట్లు గెలిచిన హెలెన్‌ తన ఆధిక్యాన్ని 4–1కు పెంచుకుంది. ఈ దశలో హెలెన్‌ తన పట్టుతో అన్షును కిందకు పడేసి ఆమె రెండు భుజాలను కొన్ని సెకన్లపాటు మ్యాట్‌కు తగిలించి పెట్టింది. దాంతో హెలెన్‌ ‘బై ఫాల్‌’ పద్ధతిలో విజయం సాధించినట్లు రిఫరీ ప్రకటించారు. తాజా ఫలితంతో అన్షు రజత పతకంతో సంతృప్తి పడింది. ఈ మెగా ఈవెంట్‌ చరిత్రలో రజతం గెలిచిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా అన్షు గుర్తింపు పొందింది. ఈ క్రమంలో కేంద్ర క్రీడాశాఖా మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సహా పలువురు అన్షుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

 

సరితాకు కాంస్యం 
మరోవైపు ఈ మెగా ఈవెంట్‌లోని మహిళల 59 కేజీల విభాగంలో భారత్‌కే చెందిన సరితా మోర్‌ కాంస్యంతో మెరిసింది. సారా జోనా లిండ్‌బోర్గ్‌ (స్వీడన్‌)తో జరిగిన కాంస్య పతక పోరులో సరిత 8–2తో విజయం సాధించింది. అల్కా తోమర్, బబితా ఫొగాట్, గీతా ఫొగాట్, వినేశ్‌ ఫొగాట్, పూజా ధాండాల తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన ఆరో భారతీయ మహిళా రెజ్లర్‌గా, ఓవరాల్‌గా పతకం నెగ్గిన ఏడో భారతీయ మహిళా రెజ్లర్‌గా సరిత గుర్తింపు పొందింది.    

చదవండి: Indian Hockey: హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, గుర్జీత్‌ కౌర్‌లకు ఉత్తమ క్రీడాకారుల అవార్డులు

మరిన్ని వార్తలు