IND Vs AUS 1st T20: ఇలాంటి ఫీల్డింగ్‌, బౌలింగ్‌తో కష్టమే.. కప్‌ కాదు కదా కనీసం!

21 Sep, 2022 07:21 IST|Sakshi

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టి20లో టీమిండియా చెత్త ఫీల్డింగ్‌, బౌలింగ్‌తో తగిన మూల్యం చెల్లించుకుంది. ఆస్ట్రేలియా బ్యాటర్లు ఇచ్చిన మూడు సులువైన క్యాచ్‌లను టీమిండియా ఆటగాళ్లు నేలపాలు చేయడం కొంపముంచింది. ఆ తర్వాత వికెట్లు పడి మ్యాచ్‌ భారత్‌ చేతిలోకి వచ్చినప్పటికి భువనేశ్వర్‌, హర్షల్‌ పటేల్‌లు తమ చెత్త బౌలింగ్‌తో చేజేతులా టీమిండియాను ఓడిపోయేలా చేశారు.

భువనేశ్వర్‌ అయితే మరీ దారుణంగా బౌలింగ్‌ చేశాడు. 4ఓవర్లలో ఒక్క వికెట్‌ కూడా తీయని భువీ ఏకంగా 52 పరుగులు సమర్పించుకున్నాడు. అంతకముందు హర్షల్‌ పటేల్‌ కూడా దారుణంగా విఫలమయ్యాడు. 4 ఓవర్లలో 49 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ తీయలేదు. ఇక ఫ్రంట్‌లైన్‌ స్పిన్నర్‌గా జట్టులోకి వచ్చిన చహల్‌ 3.2 ఓవర్లలోనే 42 పరుగులిచ్చి ఒక వికెట్‌ మాత్రమే తీశాడు. ఇక ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చిన అక్షర్‌ పటేల్‌ బ్యాటింగ్‌లో విఫలమైనప్పటికి.. బౌలింగ్‌ మాత్రం బాగా వేశాడు. ఒక దశలో టీమిండియా చేతుల్లోకి మ్యాచ్‌ వచ్చిందంటే అదంతా అక్షర్‌ పటేల్‌ చలవే.

అక్షర్‌ ఒక్కడే 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. గుడ్డిలో మెల్ల అన్నట్లుగా టీమిండియా తరపున టి20లు ఆడి చాలా కాలమైనప్పటికి.. ఉమేశ్‌ యాదవ్‌ 2 ఓవర్లలో 27 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. అసలు ఫ్రంట్‌లైన్‌ పేసర్‌గా ఉన్న ఉమేశ్‌ యాదవ్‌ను రెండు ఓవర్లకే పరిమితం చేయడంలో రోహిత్‌ శర్మ అంతరం ఏంటో అర్థం కాలేదు. వాస్తవానికి తొలి ఓవర్లో ఉమేశ్‌ భారీగా పరుగులు ఇచ్చుకున్నప్పటికి.. ఆ తర్వాతి ఓవర్లో సూపర్‌ బౌలింగ్‌ వేశాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి మ్యాచ్‌ను భారత్‌ చేతుల్లోకి తెచ్చాడు. ఆ తర్వాత ఉమేశ్‌ మళ్లీ బౌలింగ్‌కు రాకపోవడం గమనార్హం.

ఇక ఫీల్డింగ్‌ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మూడు విలువైన క్యాచ్‌లు టీమిండియాను విజయానికి దూరం చేశాయి. అక్షర్‌ పటేల్‌, కేఎల్‌ రాహుల్‌, హర్షల్‌ పటేలు సులవైన క్యాచ్‌లు వదిలేసి మూల్యం చెల్లించుకున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే మాత్రం టీమిండియా ఆసీస్‌కు సిరీస్‌ను కోల్పోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అంతేకాదు ఇలాంటి ఫీల్డింగ్‌, బౌలింగ్‌ వనరులతో టి20 ప్రపంచకప్‌కు వెళితే కప్‌ కాదు కదా.. తొలి రౌండ్‌ను దాటడం కూడా కష్టమే. అయితే బుమ్రా, షమీ రూపంలో ఇద్దరు నాణ్యమైన పేసర్లు అందుబాటులో లేకపోవడం కూడా టీమిండియాకు దెబ్బే అని చెప్పొచ్చు. అయితే వచ్చే టి20కి షమీ, బుమ్రాలలో ఒకరు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

చదవండి: 'సరైన బౌలర్లు లేరు.. అందుకే ఓడిపోయాం'

మరిన్ని వార్తలు