అతని కోసం ఐపీఎల్‌ ఫ్రాంచైజీలన్నీ ఎగబడతాయి..

14 Jun, 2021 17:03 IST|Sakshi

ఆక్లాండ్‌: అరంగేట్రంలోనే డబుల్ సెంచరీతో దుమ్మురేపిన న్యూజిలాండ్‌ నయా సెన్సేషన్‌ డెవాన్ కాన్వేపై అతని వ్యక్తిగత కోచ్ గ్లెన్ పొక్నాల్ ప్రశంసల వర్షం కురిపించాడు. తాజాగా క్రిక్‌ ట్రాకర్‌ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..  ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో అదరగొడుతున్న అతి కొద్దిమంది క్రికెటర్లలో డెవాన్‌ కాన్వే అత్యుత్తమ ఆటగాడని ఆకాశానికెత్తాడు. త్వరలో జరుగబోయే ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్షిప్‌ ఫైనల్‌ నేపథ్యంలో టీమిండియా.. కాన్వే పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని లేకపోతే, మ్యాచ్‌ను కోల్పోయే ప్రమాదముందని హెచ్చరించాడు. 

కాన్వే ఐపీఎల్‌ ఎంట్రీపై గ్లెన్ పొక్నాల్ స్పందిస్తూ.. ఐపీఎల్‌ 2021 సీజన్‌ కోసం జరిగిన మినీ వేళంలో కాన్వే అన్‌ సోల్డ్‌ ప్లేయర్‌గా మిగిలిపోవడం బాధించిందన్నాడు. రూ.50 లక్షల బేస్ ప్రైజ్‌కు కూడా అతన్ని సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి కనపర్చకపోవడం విచారకరమని పేర్కొన్నాడు. అయితే తదుపరి సీజన్‌లో పరిస్థితి వేరుగా ఉంటుందని, కాన్వే కోసం ఫ్రాంచైజీలన్నీ ఎగబడతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఓపెనర్‌గా, మిడిలార్డ్ బ్యాట్స్‌మన్‌గా అవసరమైతే వికెట్ కీపర్‌గా రాణించగలిగే సత్తా ఉన్న కాన్వేను ముంబై ఇండియన్స్ సొంతం చేసకునే అవకాశాలున్నాయని అభిప్రాయడ్డాడు. ఇదే జరిగితే, రోహిత్ శర్మ, కాన్వేల జోడీ చూడముచ్చటగా ఉంటుందని పేర్కొన్నాడు. 

కాగా, దక్షిణాఫ్రికా సంతతికి చెందిన కాన్వే.. 2017లో ఆ దేశాన్ని వదిలి న్యూజిలాండ్‌కు వలస వచ్చి అక్కడే సెట్‌ అయ్యాడు. 2017 మార్చిలో దక్షిణాఫ్రికా దేశవాలీ క్రికెట్‌లో ఆఖరి మ్యాచ్‌ ఆడిన కాన్వే.. అందులో డబుల్ సెంచరీ సాధించి, ఆ దేశానికి గుడ్‌బై చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు 14 టీ20లు, 3 వన్డేలు, రెండు టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడిన కాన్వే.. టీ20ల్లో 151.12 సగటులో 473 పరుగులు(4 అర్ధశతకాలు), వన్డేల్లో 75 సగటులో 225 పరుగులు(సెంచరీ, హాఫ్‌ సెంచరీ), టెస్ట్‌ క్రికెట్‌లో డబుల్‌ సెంచరీ, అర్ధసెంచరీ సాయంతో 306 పరుగులు సాధించాడు.
చదవండి: శతక్కొట్టిన పంత్‌.. ఫిఫ్టీతో ఆకట్టుకున్న గిల్‌
 

>
మరిన్ని వార్తలు