WPL 2023: హేమలత, గార్డ్‌నర్‌ మెరుపు అర్ధశతకాలు.. గుజరాత్‌ జెయింట్స్‌ భారీ స్కోర్‌

20 Mar, 2023 17:17 IST|Sakshi

డబ్ల్యూపీఎల్‌-2023లో భాగంగా యూపీ వారియర్జ్‌తో ఇవాళ (మార్చి 20) జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ భారీ స్కోర్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన జెయింట్స్‌.. దయాలన్‌ హేమలత (33 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆష్లే గార్డ్‌నర్‌ (39 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

గార్డ్‌నర్‌, హేమలత జోరు చూసి ఓ దశలో జెయింట్స్‌ స్కోర్‌ సునాయాసంగా 200 పరుగులు దాటుతుందని భావించినప్పటికీ.. రెండు ఓవర్ల వ్యవధిలో ఇద్దరు ఔట్‌ కావడంతో ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్‌ నమోదైంది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న గార్డ్‌నర్‌ ఎడాపెడా షాట్లు బాది భారీ స్కోర్‌కు దోహదపడింది. సోఫీ డంక్లే (23), లారా వోల్వార్డ్‌ (17) తొలి వికెట్‌కు 41 పరుగులు (4.1 ఓవరల్లో) జోడించి శుభారంభాన్ని అందించగా.. హర్లీన్‌ డియోల్‌ (4), అశ్వనీ కుమారి (5) విఫలమయ్యారు.

వారియర్జ్‌ బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్‌, పర్షవి చోప్రా తలో 2 వికెట్లు పడగొట్టగా.. అంజలీ సర్వాని, సోఫీ ఎక్లెస్టోన్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. 4 ఓవర్లు బౌల్‌ చేసిన దీప్తి శర్మ భారీగా పరుగులు (49) సమర్పించుకుంది. 

కాగా, ప్రస్తుత లీగ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండగా.. వారియర్జ్‌ ఆడిన 6 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో మూడో ప్లేస్‌లో ఉంది. తొలి రెండు స్థానాల్లో ఉన్న ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇదివరకే క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించాయి.  

మరిన్ని వార్తలు