WPL 2023 MI VS GG: క్రికెట్‌ చరిత్రలో తొలిసారి.. కొత్త రూల్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన హర్మన్‌

5 Mar, 2023 15:51 IST|Sakshi

మహిళల ఐపీఎల్‌ (WPL) అరంగేట్రం సీజన్‌ (2023) తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌-గుజరాత్‌ జెయింట్స్‌ జట్లు తలపడిన విషయం తెలిసిందే. ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియం వేదికగా నిన్న (మార్చి 4) జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌.. గుజరాత్‌ జెయింట్స్‌ను 143 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై.. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (30 బంతుల్లో 65; 14 ఫోర్లు), ఓపెనర్‌ హేలీ మాథ్యూస్‌ (31 బంతుల్లో 47; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), అమేలియా కెర్‌ (24 బంతుల్లో 45 నాటౌట్‌; 6 ఫోర్లు, సిక్స్‌) మెరుపు ఇన్నింగ్స్‌లతో విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్‌ చేయగా.. ఛేదనలో సైకా ఇషాఖీ (3.1-1-11-4), నాట్‌ సీవర్‌-బ్రంట్‌ (2-0-5-2), అమేలియా కెర్ర్‌ (2-1-12-2), ఇస్సీ వాంగ్‌ (3-0-7-1) చెలరేగడంతో చేతులెత్తేసిన గుజరాత్‌ టీమ్‌ 15.1 ఓవర్లలో 64 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 

కాగా, ఈ మ్యాచ్‌లో చోటు చేసుకున్న ఓ ఆసక్తికర సన్నివేశం ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. గుజరాత్‌ ఇన్నింగ్స్‌ సందర్భంగా సైకా ఇషాఖీ బౌల్‌ చేసిన 13వ ఓవర్‌ ఆఖరి బంతిని ఫీల్డ్‌ అంపైర్‌ వైడ్‌ బాల్‌గా ప్రకటించింది. అయితే అంపైర్‌ కాల్‌పై అభ్యంతరం వ్యక్తం చేసిన ముంబై కెప్టెన్‌ హర్మన్‌ రివ్యూ కోరింది. రీప్లేలో బంతి బ్యాటర్‌ మోనిక గ్లోవ్స్‌ను తాకినట్లు స్పష్టంగా తెలియడంతో అంపైర్‌ తన నిర్ణయాన్ని మార్చుకోక తప్పలేదు.

క్రికెట్‌ చరిత్రలో ఇలా వైడ్‌ బాల్‌ విషయంలో రివ్యూకి వెళ్లడం ఇదే తొలిసారి. WPLలో వైడ్‌ బాల్స్‌తో పాటు నో బాల్స్‌ విషయంలోనూ రివ్యూకి వెళ్లే వెసలుబాటు ఉంది. ఈ ఛాన్స్‌ను హర్మన్‌ విజయవంతంగా వాడుకుని సక్సెస్‌ అయ్యింది. గతంలో ఔట్‌ విషయంలో మాత్రమే అంపైర్‌ కాల్‌ను ఛాలెంజ్‌ చేసే అవకాశం ఉండేది.

WPL 2023 నుంచి బీసీసీఐ వైడ్‌, నో బాల్స్‌ విషయంలోనూ రివ్యూకి వెళ్లే వెసలుబాటు కల్పించింది. హోరాహోరీ మ్యాచ్‌ల్లో రాంగ్‌ కాల్‌ (వైడ్‌, నో బాల్‌)  వల్ల నష్టం జరగకూడదనే బీసీసీఐ ఈ కొత్త రూల్‌ను అమల్లోకి తెచ్చింది. వైడ్‌బాల్‌ రివ్యూ వల్ల ముంబై ఇండియన్స్‌ను ఒరిగింది ఏమీ లేనప్పటికీ.. ఇలాంటి రూల్ ఒకటి ఉందని సగటు క్రికెట్‌ అభిమానికి ఈ మ్యాచ్‌ ద్వారానే తెలిసింది. 

>
మరిన్ని వార్తలు