WPL 2023: పరుగుల వరద.. ముంబై టాపార్డర్‌ పటిష్టంగా ఉన్నా ఆర్సీబీ గెలుపు ఖాయం!

6 Mar, 2023 13:10 IST|Sakshi
హర్మన్‌- స్మృతి(PC: BCCI)

Womens Premier League 2023 RCB VS MI: మహిళా ప్రీమియర్‌ లీగ్‌-2023లో భాగంగా తమ రెండో మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తప్పక గెలుస్తుందని టీమిండియా మాజీ బ్యాటర్‌ ఆకాశ్‌ చోప్రా అన్నాడు. ముంబై ఇండియన్స్‌ మహిళా జట్టుపై స్మృతి సేన పైచేయి సాధిస్తుందని జోస్యం చెప్పాడు. ఇరు జట్ల మధ్య పోటీ రసవత్తరంగా సాగడం ఖాయమని.. ఆర్సీబీని విజయం వరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. 

అయితే, టాస్‌ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకోవాలని సూచించాడు. ఇక ముంబై టాపార్డర్‌ పటిష్టంగా ఉన్నపటికీ ఆర్సీబీ వైపు మొగ్గు చూపడానికి గల కారణాలు విశ్లేషిస్తూ తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘బెంగళూరు మొదటి మ్యాచ్‌లో ఓడిపోయింది. అయితే, ఆ మ్యాచ్‌ జరిగింది బ్రబౌర్న్‌ స్టేడియంలో అన్న విషయం అందరికీ తెలిసిందే.

ప్రస్తుతం ముంబైతోనూ అదే మైదానంలో పోటీపడనుంది. ఇప్పటికే బ్రబౌర్న్‌లో ఆడినందు వల్ల అక్కడి పరిస్థితులపై ఆర్సీబీ ప్లేయర్లకు అవగాహన ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకవేళ గత ప్రదర్శనలు గమనిస్తే అందరూ ముంబై వైపే మొగ్గు చూపుతారు. కానీ నేను మాత్రం ఈసారి ఆర్సీబీకే ఓటు వేస్తున్నా.

స్మృతి రాణిస్తేనే
అయితే,  స్మృతి భారీ స్కోరు నమోదు చేయాల్సి ఉంది. ముఖ్యంగా ముంబై స్పిన్‌ ఆల్‌రౌండర్‌ హైలీ మాథ్యూస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలగాలి. ఈ ఆఫ్‌ స్పిన్నర్‌ కచ్చితంగా స్మృతిని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి స్మృతి మరింత జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. ఇక సోఫీ డివైన్‌ కూడా బ్యాట్‌ ఝులిపించాల్సి ఉంది. 

ఇక ఆర్సీబీ పేస్‌ ఆల్‌రౌండర్‌ ఎలిస్‌ పెర్రీ బౌలింగ్‌ సేవలను మరింత మెరుగ్గా వాడుకోవచ్చు’’ అని ఆకాశ్‌ చోప్రా చెప్పుకొచ్చాడు. అదే విధంగా ముంబై బ్యాటింగ్‌ ఆర్డర్‌ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ముంబై టాపార్డర్‌ అత్యద్భుతంగా ఉంది.

హేలీ మాథ్యూస్‌, యస్తికా భాటియా, నటాలీ సీవర్‌-బ్రంట్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, అమేలియా కెర్‌.. ఆ తర్వాత పూజా వస్త్రాకర్‌లతో పటిష్టంగా కనపడుతోంది’’ అని ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు. పిచ్‌ బ్యాటర్లకు అనుకూలిస్తుందన్న ఆకాశ్‌ చోప్రా.. ‘‘బ్రబౌర్న్‌ పిచ్‌ ఫ్లాట్‌గా ఉంది. మరో భారీ స్కోరు నమోదు కావడం ఖాయం. టాస్‌ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకోవాలి.

పిచ్‌ ఫ్లాట్‌గా ఉంటుంది.. కాబట్టి
ఒకవేళ ముందుగా బ్యాటింగ్‌ చేయాలనుకుంటే కనీసం 200 పరుగులు స్కోరు చేస్తేనే గెలిచే అవకాశాలు ఉంటాయి’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా డబ్ల్యూపీఎల్‌-2023 సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌తో తలపడ్డ ముంబై.. 143 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి రికార్డు సృష్టించింది. డాక్టర్‌ డీవై పాటిల్‌ స్టేడియంలో హర్మన్‌ప్రీత్‌ సేన ఆకాశమే హద్దుగా చెలరేగి తొలి మ్యాచ్‌లోనే అద్భుత విజయం సాధించింది.

మరోవైపు.. తమ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ వుమెన్‌ టీమ్‌తో తలపడ్డ ఆర్సీబీ.. 60 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇక గత మ్యాచ్‌లో ముంబై కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 30 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 65 పరుగులు చేయగా.. ఆర్సీబీ సారథి స్మృతి 23 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌ సాయంతో 35 పరుగులు సాధించింది. ఇరు జట్ల మధ్య ముంబైలోని బ్రబౌర్న్‌ స్టేడియంలో సోమవారం (మార్చి 6) మ్యాచ్‌ జరుగనుంది.

చదవండి: Virat Kohli: నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు.. కనీసం: స్మృతి మంధాన 
సచిన్‌ ప్రపంచంలో మేటి బ్యాటరే.. కానీ..! షోయబ్‌ అక్తర్‌ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు