వారిపై ఢిల్లీ క్యాపిటల్స్‌కు అమితమైన ఆసక్తి.. కోహ్లి విషయంలో మాత్రం ఎందుకో అలా..

14 Feb, 2023 13:58 IST|Sakshi

WPL Auction 2023: నిన్న (ఫిబ్రవరి 13) జరిగిన తొలి మహిళల ఐపీఎల్‌ వేలంలో టీమిండియా డాషింగ్‌ ఓపెనర్‌, అండర్‌-19 వరల్డ్‌ కప్‌ 2023 విన్నింగ్‌ కెప్టెన్‌, లేడీ సెహ్వాగ్‌గా పేరొందిన షెఫాలీ వర్మను ఢిల్లీ క్యాపిటల్స్‌ 2 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. షెఫాలీ కోసం ఆర్సీబీ సైతం తీవ్రంగా పోటీపడినప్పటికీ పట్టు వదలని ఢిల్లీ ఎట్టకేలకు భారత సివంగిని దక్కించుకుంది.

షెఫాలీని ఢిల్లీ దక్కించుకున్న తర్వాత సోషల్‌మీడియాలో ఓ ఆసక్తికర విషయం విపరీతంగా ట్రోల్‌ అయ్యింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ గతంలోకి ఓసారి తొంగి చూస్తే.. ఈ ఫ్రాంచైజీ అండర్‌-19 వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ కెప్టెన్ల అడ్డాగా పేరొందింది. అండర్‌-19 వరల్డ్‌కప్‌లో భారత్‌ను జగజ్జేతగా నిలిపిన ఉన్ముక్త్‌ చంద్‌ 2011-13 మధ్యలో నాటి ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిధ్యం వహించగా.. 2018 అండర్‌-19 వరల్డ్‌కప్‌లో టీమిండియాను విశ్వవిజేతగా నిలిపిన పృథ్వీ షా.. గత నాలుగు సీజన్లు ఢిల్లీ ఫ్రాంచైజీకే ఆడుతున్నాడు.

వీరి తర్వాత భారత్‌ను అండర్‌-19 వరల్డ్‌కప్‌-2022 విజేతగా నిలిపిన యశ్‌ ధుల్‌ను 2022 ఐపీఎల్‌ సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ కోటి రూపాయలు వెచ్చించి సొంతం చేసుకుంది. తాజాగా తొలి మహిళల అండర్‌-19 టీ20 వరల్డ్‌కప్‌ నెగ్గిన భారత యువ జట్టు కెప్టెన్‌ షెఫాలీ వర్మను ఢిల్లీ క్యాపిటల్స్‌ 2 కోట్లకు సొంతం చేసుకుంది.

అయితే ఇక్కడ ఓ ఆసక్తికర విషయం ఏంటంటే.. భారత అండర్‌-19 వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ కెప్టెన్లపై అమితాసక్తి కనబరుస్తూ వస్తున్న ఢిల్లీ ఫ్రాంచైజీ, 2008 అండర్‌-19 వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ కెప్టెన్‌, నేటి భారత స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లిని మాత్రం ఎందుకో ఆర్సీబీకి వదిలేసింది. పై పేర్కొన్న ఆటగాళ్లలో కొందరు ఢిల్లీకి చెందిన వారు కానప్పటికీ కొనుగోలు చేసిన డీసీ ఫ్రాంచైజీ.. కోహ్లి ఢిల్లీ వాస్తవ్యుడైనప్పటికీ అతన్ని మిస్‌ చేసుకుంది. 

మరిన్ని వార్తలు