రెజ్లర్‌ దీపక్‌ పూనియా డిశ్చార్జ్‌ 

7 Sep, 2020 10:03 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇటీవలే కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరిన భారత స్టార్‌ రెజ్లర్, ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ రజత పతక విజేత దీపక్‌ పూనియా డిశ్చార్జ్‌ అయ్యాడు. అతడి ఆరోగ్యం నిలకడగా ఉండటంతో పాటు కరోనా లక్షణాలు కనిపించకపోవడంతో వైద్యులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ‘స్పోర్ట్స్‌ అథారిటీ అఫ్‌ ఇండియా (సాయ్‌)’ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. (చదవండి: హామిల్టన్‌కు చుక్కెదురు)

అయితే అతడికి ఇంకా కరోనా నెగెటివ్‌ అని రాకపోవడంతో హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించినట్లు, ఇందుకు జిల్లా కోవిడ్‌–19 నోడల్‌ అధికారి కూడా అంగీకరించినట్లు ‘సాయ్‌’ తెలిపింది. ఈ నెలలో హరియాణాలోని సోనేపట్‌ వేదికగా పురుషుల జాతీయ శిక్షణ శిబిరం ఆరంభమవుతుండటంతో... దీనికి ఎంపికైన రెజ్లర్లకు కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో దీపక్‌తో పాటు నవీన్‌ (65 కేజీల విభాగం), కృషన్‌ కుమార్‌ (125 కేజీల విభాగం) కూడా కరోనా పాజిటివ్‌లుగా తేలడం తో ముగ్గురిని ‘సాయ్‌’ హాస్పిటల్‌లో చేర్పించారు. ఇప్పటికే దీపక్‌ 86 కేజీల విభాగంలో టోక్యో ఒలింపిక్‌ బెర్తును సొంతం చేసుకున్నాడు.


 

మరిన్ని వార్తలు