నా మనసు చెబుతోంది అది కుట్రేనని...

9 Sep, 2020 09:25 IST|Sakshi
నర్సింగ్‌ యాదవ్‌

ఇన్నేళ్లయినా సీబీఐ ఏమీ తేల్చలేదు

డోపీ మరకపై రెజ్లర్‌ నర్సింగ్‌ యాదవ్‌

న్యూఢిల్లీ: ఆ మచ్చే లేకుంటే మహారాష్ట్ర కుస్తీ వీరుడు నర్సింగ్‌ యాదవ్‌ ‘డబుల్‌ ఒలింపియన్‌’ రెజ్లర్‌ అయ్యేవాడు. కానీ 2016 రియో ఒలింపిక్స్‌కు ముందు నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడంతో అతన్ని తప్పించడంతోపాటు నాలుగేళ్ల నిషేధం కూడా విధించారు. ఈ శిక్షాకాలం పూర్తవడంతో మళ్లీ కసరత్తు ప్రారంభించిన నర్సింగ్‌ తనకు జరిగింది ముమ్మాటికీ అన్యాయమనే వాపోతున్నాడు. తనకు తెలిసి ఏ తప్పూ చేయలేదని, ఏ ఉత్ప్రేరకాన్ని తీసుకోలేదని, తిన్న ఆహారం, తాగునీరు ద్వారానే తనను కావాలని ఇరికించి ఒలింపిక్స్‌ ఆశల్ని చిదిమేశారని విచారం వ్యక్తం చేశాడు. ఇన్నేళ్లయినా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దోషులెవరనేది తేల్చలేదని అసహనం వ్యక్తం చేశాడు. (విష్ణు విశాల్‌తో గుత్తా జ్వాల ఎంగేజ్‌మెంట్)

గతేడాది సీబీఐ ఈ కేసు విషయమై కోర్టుకు నివేదిక సమర్పించింది. ఉద్దేశ పూర్వకంగా రెజ్లర్‌ను ఇరికించినట్లు, కుట్ర జరిగినట్లుగా ఆధారాలేవీ లేవని అందులో పేర్కొంది. దీనిపై నర్సింగ్‌ తరపు న్యాయవాదులు పిటిషన్‌ దాఖలు చేసినప్పటికీ కోర్టు నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదని సీబీఐ వర్గాలు తెలిపాయి. సీబీఐ అధికారుల్ని నర్సింగ్‌ సంప్రదిస్తే విచారణ ఇంకా కొనసాగుతోందని సమాధానం వచ్చింది. ఎన్నో క్లిష్టమైన కేసుల్ని దర్యాప్తు చేసే సీబీఐ ఈ చిన్న కేసులో ఎందుకు జాప్యం చేస్తుందో తెలియడం లేదన్నాడు. తనపై తనకు నమ్మకముందని... నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని పేర్కొన్నాడు. 31 ఏళ్ల రెజ్లర్‌ సోనెపట్‌లోని భారత స్పోర్ట్స్‌ అథారిటీ (సాయ్‌) కేంద్రంలో శిక్షణ శిబిరానికి వచ్చాడు. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉండగా... ఈ నెల 15 నుంచి శిబిరం మొదలవుతుంది.

గతం గతః...
పురుషుల ఫ్రీస్టయిల్‌ 74 కేజీల విభాగంలో తనకు పోటీదారుడైన స్టార్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌పై అనుమానాలున్నాయా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ‘గతం గతః. దాన్ని ఇప్పుడు తొవ్వాలని అనుకోవడం లేదు. అయితే నాకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగొద్దనేదే నా అభిమతం’ అని అన్నాడు. వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్‌ తన సత్తా నిరూపించుకునేందుకు ఓ అవకాశంగా సద్వినియోగం చేసుకుంటానని చెప్పాడు. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో నర్సింగ్‌ 74 కేజీల విభాగంలో బరిలోకి దిగి తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు.  (బాక్సర్‌ సరితాదేవి ‘నెగెటివ్‌’)

>
మరిన్ని వార్తలు