Peng Shuai: లైంగిక ఆరోపణలు.. ‘ఆమె’ ఆచూకీ చెప్పిచావండి! చైనాకు అల్టిమేటం జారీ

3 Dec, 2021 10:58 IST|Sakshi

అగ్రదేశాలతో పోటీ పడి పరుగులు తీసే క్రమంలో.. డ్రాగన్‌ కంట్రీ బొక్కాబోర్లా పడుతోంది. అది ఏ ఒక్క రంగానికో పరిమితం కాలేదు. అలాగే అంతర్జాతీయ సమాజంలో చైనా పేరును బద్నాం చేసేలా ఎవరు వ్యాఖ్యలు చేసినా, చేష్టలకు పాల్పడ్డా సహించడం లేదు. ఈ క్రమంలోనే సొంత క్రీడాకారిణి విషయంలో  తప్పటడుగు వేసి.. ఫలితం అనుభవిస్తోంది ఇప్పుడు. 

క్రీడలంటే అమిత ఆసక్తి చూపే చైనాపైనే ఇప్పుడు క్రీడాలోకం తిరగబడింది. కనిపించకుండా పోయిన చైనా టెన్సిస్‌ క్రీడాకారిణి పెంగ్‌ షువాయి ఆచూకీ చెప్పాల్సిందేనంటూ వుమెన్స్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌(WTA) చైనాను ఏకీపారేసింది. ఆమె ఆచూకీ చెప్పేవరకు చైనాలో జరగాల్సిన అంతర్జాతీయ పోటీలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించి డబ్ల్యూటీఏ దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది.

పెంగ్‌ ఆచూకీ చెప్పేవరకు అంతర్జాతీయ టెన్నిస్‌ పోటీలకు ఆతిథ్యమివ్వనున్న చైనాలో తక్షణమే పోటీలను నిలిపివేస్తున్నట్లు డబ్ల్యూటీఏ అధ్యక్షుడు స్టీవ్‌ సిమన్‌ ప్రకటించారు. ఈ విషయంలో డబ్ల్యూటీఏ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ నుంచి పూర్తి మద్దతు ఉన్నట్లు ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

విషయంలోకి వెళితే.. కమ్యూనిస్ట్‌ పార్టీకి చెందిన కీలకనేత జాంగ్‌ గవోలి (అధ్యక్షుడు జిన్‌ పింగ్‌కు కీలక అనుచరుడు) తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు పెంగ్‌ షువాయి నవంబర్‌ 2న సంచలన ఆరోపణలు చేసింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. అయితే వెంటనే ఆ పోస్టును డిలీట్‌ చేసింది. అయితే ఆమె ఏరోజైతే పోస్ట్‌ డిలీట్‌ చేసిందో ఆరోజు నుంచి కనిపించకుండా పోయింది. ఈ విషయం బయటకు తెలియడంతో పెంగ్‌ షువాయి అదృశ్యంపై పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగింది. అంతర్జాతీయ టెన్నిస్‌ స్టార్లు నొవాక్‌ జకోవిచ్‌ మొదలుకొని సెరెనా, నవామీ ఒసాకా, నాదల్‌, పలువురు మాజీ టెన్నిస్‌ క్రీడాకారులతో పాటు ఇతర రంగాలకు చెందిన క్రీడాకారులు సైతం ఆమె ఆచూకీ చెప్పాలంటూ ఆందోళన వ్య​క్తం చేశారు.

మోసం బట్టబయలు!
కాగా, పెంగ్‌ కనిపించకపోవడంపై సీరియస్‌ యాక్షన్‌ తీసుకున్నారు వుమెన్స్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు స్టీవ్‌ సిమన్‌. ఆమె ఆచూకీపై సందేహాలు వ్యక్తం చేస్తూ వెంటనే చైనా ప్రభుత్వం ఆమె ఆచూకీ గురించి చెప్పాలని.. లేదంటే ఆ దేశంలో జరగనున్న అన్ని టోర్నీలను తక్షణమే నిలిపివేస్తామని హెచ్చరించారు. దీంతో చైనా అధికార మీడియా సంస్థ హడావిడి మొదలుపెట్టింది. పెంగ్‌ పేరుతో డబ్ల్యూటీఏకి ఒక ఈ మెయిల్‌ పంపించింది. ''తాను సురక్షితంగానే ఉన్నానని.. నేను చేసిన ఆరోపణలు నిజం కావని.. త్వరలోనే బయటికి వస్తానని'' పేర్కొంది. ఇంకో మెట్టు ఎక్కి అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ ఛైర్మన్‌ థామస్‌ బాచ్‌తో పెంగ్‌ మాట్లాడిదంటూ చైనా ప్రభుత్వం అక్కడి చానెళ్లలో పలు వీడియోలు ప్రసారం చేసింది.

అయితే ఈ తతంగం అంతా డబ్ల్యూటీఏకు అనుమానాల్ని కలిగించింది. చైనా ప్రభుత్వం పంపించిన ఈమెయిల్‌, వీడియోకాల్‌పై అనుమానం వ్యక్తం చేసిన స్టీవ్‌ సిమన్‌ పెంగ్‌..  ఆచూకీపై స్పష్టమైన ఇవ్వాలని చైనాను కోరాడు. అయితే ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఇప్పుడు ఏకంగా ఆ దేశంలో నిర్వహించాల్సిన అన్ని టోర్నీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

మరిన్ని వార్తలు