WTC Final 2023: తెలుపులో నీలం రంగు.. మెరిసిపోతున్న టీమిండియా క్రికెటర్లు

3 Jun, 2023 16:28 IST|Sakshi

వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2021-23 ఫైనల్‌లో టీమిండియా ఆటగాళ్లు ధరించబోయే జెర్సీని ఇటీవలే (జూన్‌ 1) భారత జట్టు అఫీషియల్‌ కిట్‌ స్పాన్సర్‌ అడిడాస్‌ ఆవిష్కరించింది. తాజాగా టెస్ట్‌ జెర్సీలో టీమిండియా ఆటగాళ్ల ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. భారత జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి కొత్త టెస్ట్‌ కిట్‌ ధరించి ఫోటోలకు పోజులిచ్చారు. 

తెలుపు, నీలం రంగుతో కూడిన ఈ జెర్సీలో టీమిండియా ఆటగాళ్లు మెరిసిపోతున్నారు. భుజాలు, కాలర్‌పై నీలం రంగు బార్డర్‌ కలిగి, నీలం రంగులో ఇండియా అని రాసి ఉండి, ఎడమవైపు ఛాతిపై బీసీసీఐ ఎంబ్లమ్‌, కుడివైపు అడిడాస్‌ సింబల్‌తో కూడిన ఈ జెర్సీ చాలా కొత్తగా, అద్భుతంగా ఉందంటూ అభిమానులు కొనియాడుతున్నారు. 

గతంలో టెస్ట్‌లకు పూర్తి తెలుపు రంగు కిట్‌ వాడేవారని, అది చూడటానికి అంత బాగుండేది కాదని, ప్రస్తుతమున్న కిట్‌ చాలా బాగుందని జనాలు కామెంట్స్‌ చేస్తున్నారు. మరోవైపు వన్డే, టీ20 జెర్సీలు సైతం పర్వాలేదని మెచ్చుకుంటున్నారు.  రోహిత్‌, కోహ్లి, హార్ధిక్‌, బుమ్రా, వుమెన్స్‌ క్రికెట్‌ టీమ్‌ స్టార్‌ ప్లేయర్‌ స్మృతి మంధన కొత్త వన్డే, టీ20 జెర్సీలు ధరించి ఫోటోలకు పోజులిచ్చారు. 

కాలర్‌ లేకుండా డార్క్‌ బ్లూ కలర్‌లో ఉండే జెర్సీ టీ20లకు.. లైట్‌ బ్లూ కలర్‌లో కాలర్‌తో ఉన్న జెర్సీని వన్డేలకు.. వైట్‌ కలర్‌ జెర్సీని టెస్ట్‌లకు టీమిండియా ఆటగాళ్లు ధరించనున్నారు. కాగా, భారత జట్టు అఫీషియల్‌ కిట్ స్పాన్సర్ అడిడాస్‌ సంస్థనే  టీమిండియా జెర్సీ స్పాన్సర్‌గా కూడా వ్యవహరించిన విషయం తెలిసిందే. నైక్ కంపెనీ తర్వాత కిట్ స్పాన్సరే (అడిడాస్‌) జెర్సీని కూడా తయారు చేయడం ఇదే మొదటిసారి.

ఇదిలా ఉంటే, భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఓవల్‌ మైదానం వేదికగా జూన్‌ 7 నుంచి 11 వరకు వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2021-23 ఫైనల్ జరుగనుంది. ఈ ప్రతిష్టాత్మకమైన మ్యాచ్‌ కోసం భారత్‌, ఆసీస్‌ జట్లు ప్రత్యేక జెర్సీలు ధరించనున్నారు. ఇరు జట్లు ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నారు. బలాబలాల విషయంలో ఇరు జట్లు సమవుజ్జీలుగా ఉండటంతో ఈ మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతుందని అభిమానలు అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు