WTC Final Probable India XI: ఆసీస్‌తో కీలక మ్యాచ్‌.. భారత తుది జట్టులో ఎవరెవరంటే!

24 May, 2023 19:34 IST|Sakshi
టీమిండియా

WTC Fianl 2021-23: ఐపీఎల్‌-2023 ముగియగానే కాస్త విరామం తర్వాత ఐసీసీ ఈవెంట్‌ రూపంలో క్రికెట్‌ ప్రేమికులకు కావాల్సినంత మజా దొరకనుంది. వచ్చే నెలలో టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జరుగనుంది. ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత ఓవల్‌ మైదానంలో జూన్‌ 7- 11 వరకు మ్యాచ్‌ నిర్వణహకు షెడ్యూల్‌ ఖరారైన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఇప్పటికే టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సహా పలువురు ఆటగాళ్లు లండన్‌కు బయల్దేరారు. ఇక ఐపీఎల్‌-2023లో సత్తా చాటుతున్న టీమిండియా మాజీ వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే తిరిగి జట్టులో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ గాయం కారణంగా జట్టుకు దూరమైన నేపథ్యంలో రహానేకు పిలుపు వచ్చింది.

స్టార్లు దూరం
ఇక ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా వెన్నునొప్పి కారణంగా, యాక్సిడెంట్‌ కారణంగా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అందుబాటులో ఉండలేకపోయారు. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆసీస్‌తో తలపడే భారత తుది జట్టును అంచనా వేశాడు టీమిండియా మాజీ హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి.

రహానేకు చోటు ఖాయం
ఐసీసీ రివ్యూ షోలో మాట్లాడుతూ.. రహానేకు కచ్చితంగా ప్లేయింగ్‌ 11లో చోటు దక్కుతుందని అభిప్రాయపడ్డాడు. ఇక కేఎల్‌ రాహుల్‌ గాయం కారణంగా దూరమైన నేపథ్యంలో రోహిత్‌ శర్మకు జోడీగా సూపర్‌ ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్‌ గిల్‌ను మరో ఓపెనర్‌గా ఎంపిక చేశాడు. 

ఓవల్‌ పిచ్‌పై స్టార్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌ ప్రభావం చూపగలరని పేర్కొన్నాడు. ఇక బుమ్రా లేకపోవడం టీమిండియాకు తీరని లోటన్న రవిశాస్త్రి.. మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌ రూపంలో మెరుగైన పేస్‌ విభాగం ఉండటం సానుకూల అంశమని పేర్కొన్నాడు. ఇక వికెట్‌ కీపర్‌గా ఆంధ్ర క్రికెటర్‌ కేఎస్‌ భరత్‌ను ఎంచుకున్నాడు.

డబ్ల్యూటీసీ ఫైనల్‌-2021-23: ఆసీస్‌తో పోరుకు రవిశాస్త్రి ఎంచుకున్న భారత జట్టు
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌, ఛతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లి, అజింక్య రహానే, రవీంద్ర జడేజా, కేఎస్‌ భరత్‌ (వికెట్‌ కీపర్‌), శార్దూల్‌ ఠాకూర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌.

చదవండి: రానున్న రెండేళ్లలో ముంబై, టీమిండియా సూపర్‌ స్టార్లు ఈ ఇద్దరే: రోహిత్‌

మరిన్ని వార్తలు