WTC Final 2023 Day-3: మూడోరోజు ముగిసిన ఆట.. 296 పరుగుల ఆధిక్యంలో ఆసీస్‌

9 Jun, 2023 22:39 IST|Sakshi

మూడోరోజు ముగిసిన ఆట.. 296 పరుగుల ఆధిక్యంలో ఆసీస్‌
డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా మూడోరోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 44 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. లబుషేన్‌ 41, కామెరాన్‌ గ్రీన్‌ ఏడు పరుగులతో ఆడుతున్నారు. టీమిండియా బౌలర్లలో జడేజా రెండు వికెట్లు తీయగా.. సిరాజ్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు.

తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకొని ఆసీస్‌ 296 పరుగులు లీడ్‌లో ఉంది. నాలుగో రోజు తొలి సెషన్‌లోపే ఆసీస్‌ను ఆలౌట్‌ చేయడానికి టీమిండియా ప్రయత్నించాలి. ఒకవేళ ఆసీస్‌ 350 కంటే ఎక్కువ ఆధిక్యం సాధిస్తే మాత్రం భారత్‌కు ఓటమి తప్పకపోవచ్చు. అందుకే నాలుగో రోజు ఆటలో టీమిండియాకు తొలి సెషన్‌ చాలా కీలకం. అంతకముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌట్‌ అయింది.

ట్రెవిస్‌ హెడ్‌(18)ఔట్‌.. రెండో వికెట్‌ ఖాతాలో వేసుకున్న జడ్డూ
తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో టీమిండియాకు చుక్కలు చూపించిన ట్రెవిస్‌ హెడ్‌కు రెండో ఇన్నింగ్స్‌లో జడ్డూ చెక్‌ పెట్టాడు. 18 పరుగులు చేసిన ట్రెవిస్‌ హెడ్‌ను జడ్డూ కాట్‌ అండ్‌ బౌల్డ్‌గా పెవిలియన్‌ చేర్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసిన ఇద్దరి(స్మిత్‌, హెడ్‌) వికెట్లను జడేజానే తీయడం విశేషం. ప్రస్తుతం ఆసీస్‌ నాలుగు వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. ఆసీస్‌ 285 పరుగుల ఆధిక్యంలో ఉంది.

మూడో వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా.. 104/3
తొలి ఇన్నింగ్స్‌ సెంచరీ హీరో స్టీవ్‌ స్మిత్‌ రెండో ఇన్నింగ్స్‌లో జడ్డూకు చిక్కాడు. 34 పరుగులు చేసిన స్మిత్‌ జడేజా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి శార్దూల్‌ ఠాకూర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. మూడు వికెట్ల నష్టానికి 104 పరుగులతో ఆడుతున్న ఆసీస్‌ 277 పరుగుల ఆధిక్యంలో ఉంది.

నిలకడగా ఆడుతున్న స్మిత్‌, లబుషేన్‌.. ఆసీస్‌ 83/2
తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో మెరిసిన స్మిత్‌తో పాటు లబుషేన్‌ నిలకడగా ఆడుతున్నారు. దీంతో ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 28 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. లబుషేన్‌ 34, స్మిత్‌ 32 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్‌ 256 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఎట్టకేలకు వికెట్‌ తీసిన ఉమేశ్‌ యాదవ్‌.. ఖవాజా(13) ఔట్‌
డబ్ల్యూటీసీ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌లెస్‌గా మిగిలపోయిన ఉమేశ్‌యాదవ్‌ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం వికెట్‌ తీశాడు. 13 పరుగులు చేసిన ఉస్మాన్‌ ఖవాజాను క్యాచ్‌ ఔట్‌గా పెవిలియన్‌ చేర్చాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా రెండు వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది.

టీ విరామం.. ఆస్ట్రేలియా 23/1
టీ విరామ సమయానికి ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టానికి 23 పరుగులు చేసింది. ఉస్మాన్‌ ఖవాజా 13, లబుషేన్‌ 8 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు వార్నర్‌ ఒక్క పరుగు చేసి సిరాజ్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.

ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌.. తొలి వికెట్‌ డౌన్‌
టీమిండియాతో డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో భాగంగా ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో తొలి వికెట్‌ కోల్పోయింది. ఒక్క పరుగు మాత్రమే చేసిన డేవిడ్‌ వార్నర్‌ సిరాజ్‌ బౌలింగ్‌లో భరత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆసీస్‌ వికెట్‌ నష్టానికి రెండు పరుగులు చేసింది.

టీమిండియా 296 ఆలౌట్‌.. ఆసీస్‌కు 173 పరుగుల ఆధిక్యం
ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో ఆసీస్‌కు 173 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. అజింక్యా రహానే 89 పరుగులతో టాప్‌ స్కోరర్‌ కాగా.. శార్దూల్‌ఠాకూర్‌ 51, జడేజా 48 పరుగులు చేశారు. ఆసీస్‌ బౌలర్లలో కమిన్స్‌ మూడు, స్టార్క్‌, బోలాండ్‌, గ్రీన్‌ తలా రెండు వికెట్లు తీయగా.. లియోన్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. 

శార్దూల్‌ ఠాకూర్‌ ఫిఫ్టీ.. టీమిండియా 292/8
డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా శార్దూల్‌ ఠాకూర్‌ హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. స్టార్‌ బ్యాటర్లంతా విఫలమైన చోట తాను మాత్రం అద్బుత ఇన్నింగ్స్‌ ఆడి 108 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో ఫిఫ్టీ మార్క్‌ అందుకున్నాడు. శార్దూల్‌ ఠాకూర్‌ కెరీర్‌లో ఇది నాలుగో టెస్టు హాఫ్‌ సెంచరీ. ప్రస్తుతం టీమిండియా 68 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది.

రహానే(89) ఔట్‌.. ఏడో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా 261 పరుగుల వద్ద ఏడో వికెట్‌ కోల్పోయిది. లంచ్‌ విరామం అనంతరం బ్యాటింగ్‌ ఆరంభించిన కాసేపటికే 89 పరుగులు చేసిన రహానే కమిన్స్‌ బౌలింగ్‌లో గ్రీన్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌కు వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో  ఏడో వికెట్‌కు శార్దూల్‌-రహానేల 109 పరుగుల భాగస్వామ్యానికి తెరపడినట్లయింది.

లంచ్‌ విరామం.. టీమిండియాను నిలబెట్టిన రహానే, శార్దూల్‌
లంచ్‌ విరామ సమయానికి టీమిండియా 60 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. అజింక్యా రహానే 89 పరుగులు బ్యాటింగ్‌కు తోడుగా. శార్ధూల్‌ ఠాకూర్‌ 36 బ్యాటింగ్‌ క్రీజులో ఉన్నాడు. ఇద్దరి మధ్య ఏడో వికెట్‌కు 108 పరుగులు జోడించడంతో టీమిండియా కాస్త కోలుకుంది.

అంతకముందు 151/5 క్రితం రోజు స్కోరుతో మూడోరోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. స్కాట్‌ బోలాండ్‌ బౌలింగ్‌లో కేఎస్‌ భరత్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శార్దూల్‌.. రహానేతో కలిసి మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ టీమిండియా ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

టీమిండియాను నిలబెడుతున్న రహానే, శార్దూల్‌
ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా తన పోరాటం కొనసాగిస్తుంది. అజింక్యా రహానే, శార్దూల్‌ ఠాకూర్‌లు టీమిండియా ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 59 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. రహానే 89, శార్దూల్‌ ఠాకూర్‌ 36 పరుగులతో ఆడుతున్నారు. టీమిండియా ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులు వెనుకబడి ఉంది.

అజింక్యా రహానే ఫిఫ్టీ.. 200 దాటిన టీమిండియా
ఆసీస్‌తో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో కష్టాల్లో ఉన్న టీమిండియాను అజింక్యా రహానే గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. ఓపికగా బ్యాటింగ్‌ చేస్తున్న రహానే 92 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్క్‌ అందుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌ ఉన్నాయి. శార్దూల్‌ 16 పరుగులతో అతనికి సహకరిస్తున్నాడు. ప్రస్తుతం టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది.

మూడోరోజు మొదలైన ఆట.. శ్రీకర్‌ భరత్‌ ఔట్‌
మూడోరోజు ఆట ప్రారంభమైన మొదటి ఓవర్లోనే టీమిండియా ఆరో వికెట్‌ కోల్పోయింది. ఐదు పరుగులు చేసిన శ్రీకర్‌ భరత్‌ స్కాట్‌ బోలాండ్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. దీంతో 152 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్‌ కోల్పోయింది.

వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో భారత్‌ ఎదురీదుతోంది. మ్యాచ్‌ రెండో రోజు గురువారం ఆట ముగిసే సమయానికి భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (51 బంతుల్లో 48; 7 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించగా... ప్రస్తుతం అజింక్య రహానే (71 బంతుల్లో 29 బ్యాటింగ్‌; 4 ఫోర్లు), భరత్‌ (5 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు.

కంగారూ బౌలర్లు ఒకరితో మరొకరు పోటీ పడి కట్టుదిట్టమైన బంతులతో భారత  బ్యాటర్లను కట్టి పడేశారు. జడేజా, రహానే కీలక భాగస్వామ్యంతో ఆదుకోకపోయుంటే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేది. సగం బ్యాటర్లు ఇప్పటికే పెవిలియన్‌ చేరగా, మరో 318 పరుగులు వెనుకబడి ఉన్న భారత్‌ తొలి  ఇన్నింగ్స్‌లో ఎంత వరకు పోరాడుతుందనే దానిపైనే టెస్టు ఫలితం ఆధారపడి ఉంది.  
 

మరిన్ని వార్తలు