WTC Final Day 5: తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా..గిల్‌(8) ఔట్‌

22 Jun, 2021 16:01 IST|Sakshi

తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా..గిల్‌(8) ఔట్‌ 
రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌(8)ను సౌథీ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు పంపాడు. దీంతో టీమిండియా 24 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతానికి భారత్‌ ఇంకా 8 పరుగులు వెనుకపడి ఉంది. ఐదో రోజు ఇంకా 29 ఓవర్ల ఆట మిగిలి ఉంది.

రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన టీమిండియా
న్యూజిలాండ్‌ను 249 పరుగులకు కట్టడి చేసిన టీమిండియా అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ(5), శభ్‌మన్‌ గిల్‌(2) ఆచితూచి ఆడుతున్నారు. దీంతో 5 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 7 పరుగులు స్కోర్‌ చేసింది. ప్రస్తుతానికి భారత్‌ ఇంకా 25 పరుగులు వెనుకపడి ఉంది. ఐదో రోజు ఇంకా 35 ఓవర్ల ఆట మిగిలి ఉంది. 

న్యూజిలాండ్‌ 249 ఆలౌట్‌.. 32 పరుగుల స్వల్ప ఆధిక్యం
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 249 పరుగులకు ఆలౌటైంది. సౌథీని(30) జడేజా క్లీన్‌ బౌల్డ్‌ చేయడంతో కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. దీంతో ఆ జట్టుకు 32 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో షమీ 4, ఇషాంత్‌ 3, అశ్విన్‌ 2,జడేజా ఓ వికెట్ పడగొట్టారు. కాగా, అంతకుముందు భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఐదో రోజు ఆటలో మరో 40.4 ఓవర్లకు ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది.

వాగ్నర్‌ డకౌట్‌.. తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన కివీస్‌
కివీస్‌ టెయింలెండర్‌ నీల్‌ వాగ్నర్‌ను అశ్విన్‌ పెవిలియన్‌కు పంపాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో రహానే స్లిప్‌లో అద్భుతమైన క్యాచ్‌ అందుకోవడంతో వాగ్నర్‌ సున్నా పరుగలుకే ఔటయ్యాడు. దీంతో 234 పరుగుల వద్ద కివీస్‌ తొమ్మిదో వికెట్‌ను కోల్పోయింది. న్యూజిలాండ్‌ ప్రస్తుతం 17 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజ్‌లో సౌథీ(23), బౌల్ట్‌(0) ఉన్నారు. భారత బౌలర్లలో షమీ 4, ఇషాంత్‌ 3, అశ్విన్‌ 2 వికెట్లు పడగొట్టారు. ఐదో రోజు ఆటలో ఇంకా 43 ఓవర్లు మిగిలి ఉన్నాయి.

ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన కివీస్‌.. డేంజరెస్‌ విలియమ్సన్‌(49) ఔట్‌
టీమిండియా పాలిట కొరకరాని కొయ్యలా మారిన కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌(49)ను.. భారత పేసర్‌ ఇషాంత్‌ శర్మ ఎట్టకేలకు దొరకబుచ్చుకున్నాడు. అర్ధసెంచరీకి కేవలం ఒక్క పరుగు దూరంలో ఉండగా థర్డ్‌ మెన్‌ దిశగా షాట్‌ ఆడబోయి టీమిండియా కెప్టెన్‌ కోహ్లీకి చేతికి చిక్కాడు. దీంతో న్యూజిలాండ్‌ 221 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్‌ను కోల్పోయింది. క్రీజ్‌లో టిమ్‌ సౌథీ(10), నీల్‌ వాగ్నర్‌(0) ఉన్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్‌ 4 పరుగుల తొలి ఇన్నింగ్స్‌తో కొనసాగుతుంది. టీమిండియా బౌలర్లలో షమీ 4, ఇషాంత్‌ 3, అశ్విన్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

షమీ ఆన్ ఫైర్‌.. ఏడో వికెట్‌ కోల్పోయిన కివీస్‌
సౌథాంప్టన్‌లో టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ మరోసారి చెలరేగుతున్నాడు. 2019 వన్డే ప్రపంచ కప్‌లో ఇదే వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌పై హ్యాట్రిక్‌ వికెట్లు పడగొట్టిన ఆయన.. సరిగ్గా రెండేళ్ల తర్వాత(జూన్‌ 22) మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. నాడు పసికూన ఆఫ్ఘనిస్తాన్‌ చేతిలో పరాభవం నుంచి కాపాడిన లాలా.. నేడు కివీస్‌పై భారత ఆధిపత్యం దిశగా తీసుకెళుక్తన్నాడు. ఐదో రోజు ఆటలో నాలుగు వికెట్లు(4/55) పడగొట్టి తన ప్రతాపం చూపుతున్న షమీ.. ప్రమాదకరంగా మారుతున్న జేమీసన్‌(16 బంతుల్లో 21; సిక్స్‌) పెవిలియన్‌కు పంపి కివీస్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. ప్రస్తుతం క్రీజ్‌లో విలియమ్సన్‌(37), సౌథీ(0) ఉన్నారు. 87 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్‌ ఏడు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. కివీస్‌ ప్రస్తుతానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌ కంటే ఇంకా 25 పరుగులు వెనుకపడి ఉంది.

ఆరో వికెట్‌ కోల్పోయిన కివీస్‌..గ్రాండ్‌హోమ్‌(13) ఔట్‌
ఐదో రోజు ఆటలో పేసర్‌ షమీ కివీస్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. తొలి సెషన్‌లో టేలర్‌(11), వాట్లింగ్‌(1) వికెట్లు పడగొట్టిన షమీ.. లంచ్‌ తర్వాత గ్రాండ్‌హోమ్‌(13) ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు  పంపాడు. దీంతో కివీస్‌ 162 పరుగలుకే 6 వికెట్లు కోల్పోయింది. క్రీజ్‌లో విలియమ్సన్‌(28), కైల్‌ జేమీసన్‌ ఉ‍న్నారు. ప్రస్తుతం కివీస్‌ భారత్‌ కంటే 55 పరుగులు వెనుకపడి ఉంది. భారత బౌలర్లలో షమీ 3, ఇషాంత్‌ 2, అశ్విన్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.  

సౌథాంప్టన్: వర్షం కారణంగా గంట ఆలస్యంగా ప్రారంభమైన ఐదో రోజు ఆటలో టీమిండియా పేసర్లు ఇరగదీస్తున్నారు. మ్యాచ్‌ ప్రారంభమైన కొద్ది సేపటికే సీనియర్‌ ఆటగాడు రాస్‌ టేలర్‌(11)ను షమీ బోల్తా కొట్టించగా, 70వ ఓవర్లో హెన్రీ నికోల్స్‌(7)ను ఇషాంత్‌ పెవిలియన్‌కు సాగనంపాడు. ఆమరుసటి ఓవర్‌లోనే షమీ కివీస్‌కు మరోషాకిచ్చాడు. వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ వాట్లింగ్‌(1)ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. దీంతో 135 పరుగులకే కివీస్‌ సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌(217)కు చేరుకోవాలంటే కివీస్‌ ఇంకా 82 పరుగులు చేయాల్సి ఉంది.

ప్రస్తుతం కేన్‌ విలియమ్సన్(19)‌, గ్రాండ్‌హోమ్‌(0) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఇషాంత్‌ 2, షమీ 2, అశ్విన్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు. కాగా, వర్షం అంతరాయం లేకుండా మ్యాచ్‌ సజావుగా సాగితే, ఫలితం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు విశ్లేషకులు. నేడు, రేపు(రిజర్వ్‌ డే) కలుపుకుని మరో 150 ఓవర్ల ఆట సాధ్యపడితే తప్పక ఫలితాన్ని ఆశించవచ్చన్నది వారి అభిప్రాయం.

కాగా, ప్రపంచ టెస్ట్ ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ మ్యాచ్‌ వరుణుడి ఆటంకం కారణంగా భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైంది. వర్షం కారణంగా తొలి రోజు, నాలుగో రోజు ఆట పూర్తిగా రద్దు కాగా, ఐదో రోజు ఆటపై కూడా సందేహాలు నెలకొని​ ఉన్న సమయంలో. వరుణుడు శాంతించడంతో ఐదో రోజు ఆట మొదలైంది. మంగళవారం కురిసిన వర్షం కారణంగా మ్యాచ్‌ సుమారు గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఐదో రోజు ఆటలో 98 ఓవర్ల వేయాల్సి ఉండగా, వరుణుడి అంతరాయం కారణంగా 7 ఓవర్లు కోత విధించారు. దీంతో ఈ రోజు మొత్తం 91 ఓవర్ల మ్యాచ్‌ జరగాల్సి ఉంది. 
చదవండి: విజేతను చూడలేం..రిజర్వ్‌ డే కలుపుకున్నా కష్టమే!

మరిన్ని వార్తలు