WTC Final: టీమిండియాతో పోరు మాకు సవాలే

18 May, 2021 19:12 IST|Sakshi

లండన్‌: టీమిండియా, న్యూజిలాండ్‌  మధ్య జూన్‌ 18 నుంచి 22 వరకు ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కివీస్‌ జట్టు ఇంగ్లండ్‌కు చేరుకోగా.. టీమిండియా జూన్ 2న ఇంగ్లండ్‌ పర్యటనకు బయల్దేరనుంది. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియాతో పోరు మాకు సవాల్‌గా మారిందని న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ పేర్కొన్నాడు. ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఫైనల్‌కు ఇంకా నెలరోజుల సమయం ఉండడంతో విలియమ్సన్‌ ఐసీసీ ఇంటర్య్వూలో మాట్లాడాడు.

''ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ ప్రవేశ పెట్టడంతో సుధీర్ఘ ఫార్మాట్‌పై ఆసక్తి పెరిగింది. ఈ రెండేళ్లలో కొన్ని ఉత్కంతకరమైన టెస్టు సిరీస్‌లు చూడగలిగాను. ఫైనల్‌ పోరుకు అర్హత సాధించాలనే పట్టుదలతో కొన్ని హోరాహోరీ మ్యాచ్‌లు చూశాను. టీమిండియా- ఆసీస్‌, న్యూజిలాండ్‌- పాకిస్తాన్‌ సిరీస్‌లు ఇందుకు ఉదాహరణ. ప్రతీ జట్టు ఫైనల్‌కు చేరాలనే పట్టుదలతో రిస్క్‌ చేశాయి.. ఫలితాలు సాధించాయి. కానీ చాంపియన్‌షిప్‌ అనేది రెండు జట్లు మాత్రమే ఆడుతాయి. అలా టీమిండియాతో పాటు మేము ఫైనల్‌కు అర్హత సాధించాం. ఇక టీమిండియాతో ఎప్పుడు ఆడిన మాకు కఠిన పరిస్థితులే ఎదురయ్యాయి. వారితో ఆడడం ఎప్పుడు సవాల్‌గానే అనిపిస్తుంది. ఈసారి మాత్రం ఫైనల్‌ ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నాం.'' అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా ఐపీఎల్‌ 14వ సీజన్‌ రద్దు తర్వాత నేరుగా ఇంగ్లండ్‌ చేరుకున్న కివీస్‌ ఫైనల్‌కు ముందు ఇంగ్లండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. ఇక భారత్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ తర్వాత ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో ఆడనుంది.
చదవండి: WTC Final: గెలుపే లక్ష్యం.. ఆ సిరీస్‌ కూడా గెలుస్తాం!

టీమిండియా మహిళా క్రికెటర్లపై బీసీసీఐ వివక్ష!

మరిన్ని వార్తలు