WTC Final: కోహ్లీ సేనపై మరోసారి విషం చిమ్మిన మైఖేల్‌ వాన్‌

23 Jun, 2021 18:25 IST|Sakshi

సౌథాంప్టన్‌: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ టీమిండియాపై మరోసారి తన అక్కసు వెళ్లగక్కాడు. అవకాశం దొరికినప్పుడల్లా టీమిండియాను తక్కువ చేస్తూ మాట్లాడే వాన్.. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ను ఉద్దేశించి కోహ్లీ సేనపై ట్విటర్‌ వేదికగా విషం చిమ్మాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఇంగ్లండ్‌లో కాకుండా మరో చోట జరిగి ఉంటే, ఈ పాటికే న్యూజిలాండ్‌ విజేతగా నిలిచేదని ట్వీట్‌ చేశాడు. వాన్.. ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారేమీ కాదు. భారత ఆస్ట్రేలియా పర్యటన నుంచి తాజా డబ్ల్యూటీసీ ఫైనల్ వరకు అవకాశం దొరికినప్పుడల్లా భారత్‌ను టార్గె్‌ట్‌ చేస్తూ వస్తున్నాడు. అయితే, ఈసారి అభిమానులు కూడా తమదైన శైలిలో వాన్‌కు చురకలంటించారు.

ఇంగ్లండ్‌ జట్టులా భారత్‌ అడ్డదారిలో ప్రపంచకప్ గెలవలేదని రివర్స్‌ కౌంటరిచ్చారు. అంపైర్ తప్పుడు నిర్ణయాలు, బౌండరీ కౌంట్ వంటి అడ్డదారులతో ఇంగ్లండ్ 2019 వన్డే ప్రపంచకప్ గెలిచిందని గుర్తు చేస్తున్నారు. విలువ తక్కువ పనులు, క్రీడా స్పూర్తి దెబ్బతీసేలా భారత జట్టు ఎప్పుడూ వ్యవహరించలేదని, నలుగురు తలెత్తుకునేలా ఆడిందని ఫైరయ్యారు. భారత జట్టు విజయాలను వాన్ ఏ మాత్రం ఓర్వలేకపోతున్నాడని, అసలు భారత్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌ రావడమే అతనికి ఇష్టం లేదని కామెంట్ చేస్తున్నారు. కాగా, గతంలో భారత్‌, ఇంగ్లండ్‌ సిరీస్ సందర్భంగా కూడా వాన్‌ ఇలానే పేలాడు. స్పిన్ పిచ్‌లు రెడీ చేశారని గగ్గోలు పెట్టాడు.

ఇదిలా ఉంటే, డబ్ల్యూటీసీ ఫైనల్ రసవత్తరంగా సాగుతోంది. ఊహించినట్లుగానే మ్యాచ్‌ ఆరో రోజుకు(రిజర్వ్‌ డే) చేరింది. 32 పరుగుల ఆధిక్యంతో ఆఖరి రోజు ఆటను కొనసాగించిన భారత్‌.. ఆరంభంలోనే మూడు కీలకమైన వికెట్లు(కోహ్లీ, పుజారా, రహానే) కోల్పోయినప్పటికీ.. పంత్‌(34), జడేజా(13) జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. లంచ్‌ విరామం తర్వాత భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 142 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం టీమిండియా 110 పరుగుల ఆధిక్యంలో ఉంది. కివీస్‌ బౌలర్లు సౌథీ, జేమీసన్‌ తలో రెండు వికెట్లు, బౌల్ట్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. కాగా, భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌట్‌ కాగా, న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 249 పరుగులకు ఆలౌటైంది. 
చదవండి: ICC Rankings: టాప్‌ ర్యాంక్‌కు దూసుకెళ్లిన జడేజా

>
మరిన్ని వార్తలు