WTC Final: అరుదైన మైలురాళ్లకు చేరువలో రోహిత్‌ శర్మ

7 Jun, 2023 13:18 IST|Sakshi

మరికొద్ది గంటల్లో ప్రారంభంకాబోయే వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2021-23 ఫైనల్‌తో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టెస్ట్‌ల్లో హాఫ్‌ సెంచరీ కొట్టనున్నాడు. ఇప్పటివరకు 49 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌కు ఈ డబ్ల్యూటీసీ ఫైనల్‌ 50వది. 49 టెస్ట్‌ల్లో 83 ఇన్నింగ్స్‌లు ఆడిన హిట్‌మ్యాన్‌.. 45.7 సగటున 9 సెంచరీలు, 14 హాఫ్‌ సెంచరీల సాయంతో 3379 పరుగులు చేశాడు. కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయే ఈ మ్యాచ్‌లో రోహిత్‌ అద్భుతంగా ఆడి, జట్టును గెలిపించాలని ఆశిద్దాం.

మరో 27 పరుగులు చేస్తే..
నేటి నుంచి ప్రారంభంకాబోయే డబ్ల్యూటీసీ ఫైనల్లో రోహిత్‌ మరో 27 పరుగులు చేస్తే, అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 13000 పరుగులు పూర్తి చేసిన మూడో భారత ఓపెనర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్‌ 15758) టాప్‌లో ఉండగా.. సచిన్‌ (15335) రెండో స్థానంలో ఉన్నాడు.

రోహిత్‌ శర్మ డబ్ల్యూటీసీ ఫైనల్లో 13000 పరుగుల మార్కును అందుకుంటే దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌కు (12258) సైతం సాధ్యం కాని ఫీట్‌ను అందుకున్న ఘనత సాధిస్తాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కనీసం 10000 పరుగులు పూర్తి చేసిన భారత ఓపెనర్లలో వీరి తర్వాత శిఖర్‌ ధవన్‌ (10867) ఉన్నాడు.

విరాట్‌ కోహ్లి తర్వాత..
వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక పరుగులు సాధించిన  భారత ఆటగాళ్ల జాబితాలో రోహిత్‌.. విరాట్‌ కోహ్లి తర్వాతి స్థానంలో ఉన్నాడు. రెండు డబ్ల్యూటీసీ సైకిల్స్‌లో కోహ్లి 1803 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్‌ 36 ఇన్నింగ్స్‌ల్లో 52.76 సగటున 1794 పరుగులు చేసి రెండో ప్లేస్‌లో ఉన్నాడు. డబ్ల్యూటీసీలో హిట్‌మ్యాన్‌ 6 సెంచరీలు, 4 హాఫ్‌ సెంచరీలు సాధించాడు. 

ఇదిలా ఉంటే, భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఓవల్‌ వేదికగా జూన్‌ 7 నుంచి 11 వరకు వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2021-23 ఫైనల్‌ జరుగనున్న విషయం తెలిసిందే. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభంకానుంది. 

చదవండి: WTC Final: "ద బాస్‌".. ఇక్కడి దాకా తీసుకొచ్చాడంటే, వదిలే ప్రసక్తే లేదు..!
 

మరిన్ని వార్తలు