WTC Final 2023:'ఎరుపు బంతి'.. ప్రాభవం కోల్పోతున్న దశ నుంచి శిఖరస్థాయికి

6 Jun, 2023 12:42 IST|Sakshi

క్రికెట్‌ అంటే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు టి20 క్రికెట్‌. అయితే ఇదే టి20 క్రికెట్‌, వన్డే క్రికెట్‌కు మూలం సంప్రదాయ ఫార్మాట్‌ అయిన టెస్టు క్రికెట్‌ అని మరిచిపోవద్దు. మనకు తెలిసి క్రికెట్‌ ప్రారంభమైంది దాదాపు మూడు వందల ఏళ్ల కిందటి పైమాటే. తొలుత బ్రిటీష్‌ వాళ్లు క్రికెట్‌ ఎక్కువగా ఆడేవారు. 17,18వ దశకంలో ఇంగ్లండ్‌లో క్రికెట్‌కు విపరీతమైన క్రేజ్‌ ఉండేది.

కాలక్రమంలో ఇంగ్లండ్‌ దేశం క్రికెట్‌కు పుట్టినిల్లుగా తయారైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్‌ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంది. 18వ దశకం చివరి నుంచి 19వ దశకం ఆరంభం వరకు ఎక్కువ మ్యాచ్‌లు ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మధ్యే జరిగేవి. అయితే మన దేశం బ్రిటీష్‌ వారి చేతుల్లో ఉండడంతో ఇక్కడ కూడా క్రికెట్‌పై ఆసక్తి బాగా ఉండేది. మన దేశం తరపున బ్రిటీష్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వారు ఉన్నారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత క్రికెట్‌పై ప్రజల్లో ఆసక్తి పెరగడం మొదలైంది. ఇక క్రికెట్‌ ప్రారంభమైనప్పటి నుంచి టెస్టు క్రికెట్‌ ఫార్మాట్‌లోనే చాలాకాలం పాటు ఆట జరిగింది. 1975లో తొలి ప్రపంచకప్‌ జరిగే వరకు కూడా టెస్టు క్రికెట్‌ మాత్రమే ఎక్కువగా జరిగేది. మన జాతీయ క్రీడ హాకీ అయినప్పటికి 1980 తర్వాత హాకీ ప్రభావం కోల్పోవడం ప్రారంభమైంది. అదే సమయంలో క్రికెట్‌ మాత్రం వైభవం పెరుగుతూ వచ్చింది. 1983లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి కపిల్‌ డెవిల్స్‌ ప్రపంచకప్‌ విజేతగా నిలవడంతో క్రికెట్‌పై క్రేజ్‌ ఆకాశమంత ఎత్తుకు వెళ్లిపోయింది.

అక్కడి నుంచి టీమిండియా వెనుదిరిగి చూసుకోలేదు. జాతీయ క్రీడ హాకీ నుంచి క్రికెట్‌ అనేలా మన ప్రాభవం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది.1990వ దశకంలో క్రికెట్‌లో పెను మార్పులు వచ్చాయి. వన్డే మ్యాచ్‌లకు కలర్‌ జెర్సీలు వాడడం.. ఎర్రబంతుల స్థానంలో తెల్లబంతులు ఉపయోగించడం మొదలైంది. క్రమంగా వన్డే  క్రికెట్‌కు ఆదరణ పెరుగుతూ వచ్చింది. వన్డే క్రికెట్‌కు ఆదరణ వచ్చినా టెస్టులకు మాత్రం క్రేజ్‌ తగ్గలేదు. అయితే టి20 క్రికెట్‌ వచ్చాకా మాత్రం టెస్టులపై ఆసక్తి సన్నగిల్లింది. వన్డేలు ఒక్కరోజులో ముగిసిపోతే.. టి20లు మాత్రం మూడున్నర గంటల్లోనే ముగిసి అభిమానులను అలరిస్తున్నాయి.

ఇప్పటి ఆటగాళ్లలో ఐదు రోజులు జరిగే టెస్టు క్రికెట్‌ కన్నా మూడు గంటల్లో ముగిసిపోయే టి 20 క్రికెట్‌ అంటేనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీనివల్ల టెస్టు క్రికెట్‌ ప్రమాదంలో పడిందేమో అన్న సంకేతాలు వినిపించాయి. కానీ మనం ఒకటి అనుకుంటే ఐసీసీ మరోలా ఆలోచించింది. ప్రాభవం కోల్పోతున్న టెస్టు క్రికెట్‌కు డబ్ల్యూటీసీ ఫైనల్‌ పేరుతో కొత్త హంగులు తీసుకొచ్చింది.

టెస్టు క్రికెట్‌ ఐదు రోజుల పాటు జరిగినప్పటికి అందులో ఉండే మజా వేరుగా ఉంటుంది. బ్యాటర్ల నుంచి కళాత్మక షాట్లు.. బౌలర్లు తీసే వికెట్లలో నైపుణ్యం కనిపిస్తుంటుంది. టి20ల్లో ఎంత వేగంగా ఆడినా.. బ్యాటింగ్‌లో నైపుణ్యం బయటపడేది టెస్టు క్రికెట్‌ ద్వారానే. ఇక స్పిన్నర్లు, పేసర్లు పోటీ పడి వికెట్లు తీస్తుంటే చూడముచ్చటగా ఉండేది. అయితే ఇప్పుడు టెస్టు మ్యాచ్‌లు కూడా దాదాపు మూడురోజుల్లోనే ముగిసిపోతున్నాయి. ఇది కొంత ఆందోళన కలిగించే అంశం.

2021లో జరిగిన తొలి డబ్ల్యూటీసీ ఫైనల్‌ మంచి టీఆర్పీ రేటింగ్‌ నమోదు చేసింది. టీమిండియా, న్యూజిలాండ్‌ మధ్య జరగడమే దీనికి కారణం. టీమిండియా ఓటమిపాలైనప్పటికి డబ్ల్యూటీసీకి మాత్రం మంచి ఆదరణ లభించింది. దీన్నిబట్టి  చూస్తే డబ్ల్యూటీసీ ఫైనల్‌ పేరుతో టెస్టు క్రికెట్‌ను నిలబెట్టేందుకు ఐసీసీ చేసిన ప్రయత్నం మెచ్చుకోదగినది.

చదవండి: WTC Final: టెస్టుల్లో టీమిండియా తరపున సిక్సర్ల రారాజు ఎవరంటే? 

మరిన్ని వార్తలు