కివీస్‌ తుదిజట్టు ఎంపిక నిరాశకు గురిచేసింది: షేన్‌ వార్న్‌

19 Jun, 2021 20:55 IST|Sakshi

సౌతాంప్టన్‌: వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కై న్యూజిలాండ్‌ తుదిజట్టు ఎంపిక పట్ల ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ షేన్‌ వార్న్‌ పెదవి విరిచాడు. అత్యంత కీలకమైన మ్యాచ్‌లో స్పిన్నర్‌ లేకుండా కివీస్‌ బరిలోకి దిగడం తనను నిరాశకు గురిచేసిందన్నాడు. కాగా సౌతాంప్టన్‌ వేదికగా టీమిండియా- న్యూజిలాండ్‌ మధ్య శనివారం ఆట ఆరంభమైన సంగతి తెలిసిందే. తొలిరోజు వర్షం కారణంగా టాస్‌ పడకుండానే ఆట రద్దు కాగా.. రెండో రోజు వరుణుడు కనికరించడంతో ఎట్టకేలకు మ్యాచ్‌ మొదలైంది. 

ఈ నేపథ్యంలో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల(అశ్విన్‌, జడేజా)తో టీమిండియా బరిలోకి దిగింది. ఇక టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న కివీస్‌ మాత్రం.. పేసర్ల వైపే మొగ్గుచూపింది. ఇంగ్లండ్‌తో ఇటీవలి టెస్టు సిరీస్‌ రెండో మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ను పక్కనపెట్టింది. 

ఈ విషయంపై ట్విటర్‌ వేదికగా స్పందించిన షేన్‌ వార్న్‌.. ‘‘వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో ఒక్క స్పిన్నర్‌ లేకుండానే న్యూజిలాండ్‌ మైదానంలో దిగడం నన్ను పూర్తి నిరాశకు గురిచేసింది. ఈ పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని ఇప్పటికే అర్థమవుతోంది. ఇండియా 275 లేదా 300 స్కోరు చేస్తుంది! వాతావరణం అనుకూలిస్తేనే ఏదైనా సాధ్యమవుతుంది’’ అని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

టీమిండియా: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, పుజారా, విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), అజింక్య రహానే, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, మహ్మద్‌ షమీ, ఇషాంత్‌ శర్మ, జస్‌ప్రీత్‌ బుమ్రా.

న్యూజిలాండ్‌ జట్టు:
టామ్‌ లాథమ్‌, డెవాన్‌ కాన్వే, కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), రాస్‌ టేలర్‌, హెన్నీ నికోలస్‌, బీజే వాట్లింగ్‌(వికెట్‌ కీపర్‌), కోలిన్‌ డీ గ్రాండ్‌హోమ్‌, కైలీ జెమీషన్‌, నీల్‌ వాగ్నర్‌, టిమ్‌ సౌథీ, ట్రెంట్‌ బౌల్ట్‌.

చదవండి: WTC Final Day 2: టీమిండియా స్కోరు- 134/3

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు