3 వారాల తర్వాత ట్రైనింగ్‌ సెషన్‌లో పాల్గొన్న టీమిండియా క్రికెటర్లు

6 Jun, 2021 16:38 IST|Sakshi

సౌతాంప్టన్‌: మూడు రోజుల కఠిన క్వారంటైన్‌ ఆనంతరం విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు ప్రాక్టీస్‌ను ప్రారంభించింది. న్యూజిలాండ్‌తో ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జూన్‌ 18 నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆటగాళ్లు మైదానంలోకి అడుగుపెట్టారు. క్వారంటైన్‌ శనివారం ముగియడంతో ఆటగాళ్లు ఆదివారం ప్రాక్టీస్‌లో పూర్తిగా నిమగ్నమయ్యారు. దాదాపు మూడు వారాల తర్వాత టీమిండియాకు ఇదే మొదటి ట్రైనింగ్‌ సెషన్‌ కావడంతో ఆటగాళ్లంతా హుషారుగా ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు.

స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా.. నెట్స్‌లో బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. సౌతాంప్టన్‌లో ఫస్ట్‌ ప్రాక్టీస్‌ అంటూ క్యాప్షన్‌ జోడించాడు. ఇంగ్లండ్‌ గడ్డపై తొలిసారి అడుగుపెట్టిన యువ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ కూడా బౌలింగ్‌ సాధన చేస్తూ హుషారుగా కనిపించాడు. వీరితో పాటు మరికొందరు టీమిండియా క్రికెటర్లు నెట్స్‌లో బిజీగా గడిపారు. టీమిండియా క్రికెటర్లు ఏజియస్‌ బౌల్‌ స్టేడియానికి పక్కనే ఉన్న హిల్టన్‌ హోటల్‌లో బస చేస్తున్నారు. కాగా, ముంబైలో రెండు వారాల క్వారంటైన్‌ అనంతరం టీమిండియా జూన్‌ 3న ఇంగ్లండ్‌కు చేరుకుంది. అనంతరం ఆటగాళ్లతో పాటు వారి కుటుంబ సభ్యులు మూడు రోజుల పాటు హోటల్‌ గదుల్లోనే ఐసోలేషన్‌లో ఉన్నారు. 

ఇదిలా ఉంటే, డబ్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా ప్రత్యర్ధి న్యూజిలాండ్‌.. ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌లో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ అరంగేట్రం ఆటగాడు డెవాన్‌ కాన్వే (200) డబుల్‌ సెంచరీతో అదరగొట్టడంతో ఆ జట్టు ప్రత్యర్ధిపై పైచేయి సాధించింది. ఈ మ్యాచ్‌ తర్వాత ఇరు జట్లు జూన్ 10న రెండో టెస్ట్‌లో తలపడతాయి. దీంతో ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్‌ జట్టుకు కావాల్సిన ప్రాక్టీస్‌ లభించినట్లవుతుంది. మరోవైపు టీమిండియా డబ్యూటీసీ ఫైనల్‌ ముగిసాక(జూన్‌ 22) 42 రోజుల పాటు ఖాళీగా ఉంటుంది. అనంతరం ఆగస్ట్‌​4 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో తలపడనుంది.
చదవండి: టిమ్‌ సౌథీ 'ఆరే'యడంతో న్యూజిలాండ్‌కు ఆధిక్యం

మరిన్ని వార్తలు