WTC Final: కివీస్‌కు ఫీల్డ్‌ అంపైర్ సాయం‌.. ఫ్యాన్స్‌ ఆగ్రహం

20 Jun, 2021 07:46 IST|Sakshi

సౌతాంప్టన్‌: భారత్, న్యూజిలాండ్ మధ్య సౌథాంప్టన్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఫీల్డ్ అంపైర్ల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫీల్డ్‌ అంపైర్‌ రిచర్డ్ లింగ్‌వర్త్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కి సాయపడినట్లుగా తెలుస్తుంది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 41వ ఓవర్‌ను ట్రెంట్‌ బౌల్ట్‌ వేశాడు. బంతిని లెగ్ స్టంప్‌కి కాస్త దూరంగా వెళ్లడంతో కోహ్లి ఫైన్ లెగ్ దిశగా బంతిని ప్లిక్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే.. బ్యాట్‌కి దొరకని బంతి నేరుగా వికెట్ కీపర్ బీజే వాట్లింగ్ చేతుల్లోకి వెళ్లింది. బంతి బ్యాట్‌కి అత్యంత సమీపంలో వెళ్లడంతో క్యాచ్ ఔట్ కోసం న్యూజిలాండ్ టీమ్ అప్పీల్ చేసింది. అయితే.. ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ లింగ్‌వర్త్ ఆ అప్పీల్‌ని తిరస్కరించాడు.

దాంతో.. బౌలర్ బౌల్ట్, కీపర్ వాట్లింగ్‌తో చర్చించిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ డీఆర్‌ఎస్ కోరేందుకు సిద్ధమయ్యాడు. విలియమ్సన్ రివ్యూ కోరకముందే అనూహ్యంగా ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ లింగ్‌వర్త్ .. తుది నిర్ణయం కోసం టీవీ అంపైర్‌ని ఆశ్రయించాడు. కారణంగా తాను క్లియర్‌గా సౌండ్ వినలేకపోయానని టీవీ అంపైర్‌తో అతను చెప్పుకొచ్చాడు. రిచర్డ్ లింగ్‌వర్త్ చర్యతో కేన్ విలియమ్సన్ సెలైంట్ అయిపోయాడు. రిప్లైని పరిశీలించిన థర్డ్ అంపైర్.. బంతి బ్యాట్‌కి దూరంగా వెళ్తున్నట్లు తేల్చి నాటౌట్‌గా ప్రకటించాడు. ఒకవేళ కేన్ విలియమ్సన్ డీఆర్‌ఎస్ కోరి ఉంటే..? అప్పుడు న్యూజిలాండ్‌కి రివ్యూ ఛాన్స్ చేజారేది. అంతకముందే ఎల్బీడబ్ల్యూ కోసం డీఆర్‌ఎస్‌కి వెళ్లిన కివీస్ ఒక రివ్యూ అవకాశాన్ని చేజార్చుకుంది. అయినప్పటికీ.. కోహ్లీ వికెట్ కావడంతో మరోసారి రిస్క్ తీసుకునేందుకు సిద్ధమైంది. కానీ ఫీల్డ్ అంపైర్ సేవ్ చేశాడు. ఫీల్డ్‌ అంపైర్‌ చేసిన పనిపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్త‍మవుతున్నాయి. 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలి రోజు వర్షం కారణంగా ఒక్క బంతి పడకపోగా, రెండో రోజు శనివారం వెలుతురులేమితో 66.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (124 బంతుల్లో 44 బ్యాటింగ్‌; 1 ఫోర్‌), అజింక్య రహానే (79 బంతుల్లో 29 బ్యాటింగ్‌; 4 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. టాస్, మ్యాచ్‌ షెడ్యూల్‌ ప్రకారమే సాగినా... మొత్తంగా మూడుసార్లు మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. వెలుతురు తగ్గడంతో టీ విరామాన్ని అంపైర్లు ముందే ప్రకటించగా... ఆ తర్వాత మరో 19 బంతులకే ఆట ఆగింది. మరో 6 ఓవర్ల తర్వాత మళ్లీ ఆగిపోయిన మ్యాచ్‌ను ఆపై కొనసాగించే అవకాశం లేకపోయింది.  
చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్‌: చీకటి కమ్మేసింది

మరిన్ని వార్తలు