WTC Final: బౌన్సర్‌ ఆడలేకపోయిన కోహ్లి .. పంత్‌ సిక్సర్ల జోరు

15 Jun, 2021 16:35 IST|Sakshi

సౌతాంప్టన్‌: ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ నేపథ్యంలో టీమిండియా ఇంట్రాస్క్వాడ్‌ మ్యాచ్‌ ప్రాక్టీస్‌ అనంతరం కొత్త జోష్‌తో కనిపిస్తుంది. టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో టీమిండియా తమ ప్రాక్టీస్‌ను మరింత పెంచింది. ఈ నేపథ్యంలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, రిషబ్‌ పంత్‌, అజింక్య రహానే నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చారు. దీనికి సంబంధించి బీసీసీఐ మంగళవారం ట్విటర్‌లో వీడియో రిలీజ్‌ చేసింది.

ఈ వీడియోలో మొదట కోహ్లి తన క్లాసిక్‌ షాట్లను ఆడాడు. కవర్‌ డ్రైవ్‌, స్క్వేర్‌కట్‌లతో మురిపించిన కోహ్లి ఇషాంత్‌ బౌన్సర్‌ ఆడడంలో విఫలమయ్యాడు. బౌన్సర్‌ను ఎదుర్కొనే క్రమంలో పట్టుతప్పి కిందపడిపోయాడు. అనంతరం ప్రాక్టీస్‌కు వచ్చిన రిషబ్‌ పంత్‌ షమీ, ఇషాంత్‌లను ఎదుర్కొని భారీ షాట్లతో రెచ్చిపోయాడు. అనంతరం రవీంద్ర జడేజా బౌలింగ్‌లో కళ్లు చెదిరే సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఇక టీమిండియా వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే కూడా ఇషాంత్‌, షమీ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ కళాత్మక షాట్లతో ఆకట్టుకున్నాడు.

 అంతకముందు జరిగిన ఇంట్రాస్క్వాడ్‌ మ్యాచ్‌లో పంత్‌, శుబ్‌మన్‌ గిల్‌, జడేజా, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ సిరాజ్‌లు ఆకట్టుకున్నారు. ముఖ్యంగా పంత్‌ శతకంతో తన ఫామ్‌ను నిరూపించగా.. జడేజా,గిల్‌లు అర్థ శతకాలతో రాణించారు. కాగా బౌలింగ్‌లో ఇషాంత్‌ 3 వికెట్లతో రాణించాడు. సౌతాంప్టన్‌ వేదికగా జూన్‌ 18 నుంచి 22 వరకు ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. మరోవైపు న్యూజిలాండ్‌ కూడా ఇంగ్లండ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకొని జోరు మీద ఉంది.
చదవండి: WTC Final: విజేతకు భారీ ప్రైజ్‌మనీ

మా ఇద్దరిలో ఎవరు బాగా చేశారో చెప్పండి..

మరిన్ని వార్తలు