WTC Final: అందుకే వాషింగ్టన్‌తో కలిసి ఉండటం లేదు!

18 May, 2021 15:26 IST|Sakshi
Courtesy: IPL

చెన్నై: ప్రతిభ ఉన్నా ఆర్థిక ఇబ్బందుల కారణంగా గొప్ప క్రికెటర్‌గా ఎదగాలనే తన ఆశయాన్ని నెరవేర్చుకోలేకపోయాడు ఓ తండ్రి. అందుకే కొడుకు ద్వారానైనా తన కల తీర్చుకోవాలని భావించాడు. తండ్రి కోరికకు తగ్గట్టుగానే, ఆయన ప్రోత్సాహంతో చిన్ననాటి నుంచే క్రికెట్‌లో ఓనమాలు దిద్దిన ఆ యువకుడు టీమిండియాలో చోటు దక్కించుకుని ఆయనకు ఆనందాన్ని పంచాడు. ఆ మధ్యతరగతి తండ్రి పేరు సుందర్‌. ఆయన కుమారుడే భారత క్రికెటర్‌ వాషింగ్టన్‌ సుందర్‌. 

శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌తో వన్డేల్లో ప్రవేశించిన వాషింగ్టన్‌... ఇటీవలి గబ్బా టెస్టుతో సంప్రదాయ క్రికెట్‌లో అరంగేట్రం చేసి ఆసీస్‌ టూర్‌ను సద్వినియోగం చేసుకున్నాడు. బ్యాట్‌తోనూ, బాల్‌తోనూ రాణించి సిరీస్‌ విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌లో న్యూజిలాండ్‌తో జరిగే వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడే భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. అదేవిధంగా, ఇంగ్లండ్‌తో జరుగనున్న 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సైతం ఎంపికయ్యాడు. 

అలా అయితేనే..
ఐపీఎల్‌​-2021లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన వాషింగ్టన్‌ సుందర్‌.. కరోనా కారణంగా టోర్నీ వాయిదా పడటంతో ఇంటికి చేరుకున్నాడు. అయితే, అతడు సాఫీగా ఇంగ్లండ్‌ విమానం ఎక్కాలంటే, మహమ్మారి కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాదు,  ముంబైలో ఏర్పాటు చేసిన బయో బబుల్‌లో 14 రోజుల కఠిన క్వారంటైన్‌ను పూర్తి చేయాల్సి ఉంది.

అయితే అంతకంటే ముందు ఆటగాళ్లంతా తమ ఇంటి వద్దే మూడుసార్లు ఆర్‌టీ–పీసీఆర్‌ టెస్టులు చేయించుకోవాల్సిందిగా ఆదేశించిన బీసీసీఐ.. అందులో ప్రతీసారి నెగెటివ్‌ అని తేలితేనే ఈ నెల 19 నుంచి ఆరంభమయ్యే క్వారంటైన్‌కు అనుమతి లభిస్తుందని స్పష్టం చేసింది. క్రికెటర్లు ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో, దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే, స్వీయ నిర్బంధంలో ఉండటం సంపన్న క్రికెటర్లకు ఇదేమీ పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ వాషింగ్టన్‌ సుందర్‌ వంటి మధ్యతరగతి కుటుంబాలకు కాస్త కష్టమైన విషయమే. అందుకే అతడి తండ్రి సుందర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొడుకు ప్రయాణం సాఫీగా సాగేందుకు వీలుగా వేరే ఇంటికి ఫిష్ట్‌ అయిపోయారు.

అందుకే వేరుగా ఉంటున్నా..
ఈ విషయం గురించి సుందర్‌ మాట్లాడుతూ.. ‘‘వాషింగ్టన్‌ ఐపీఎల్‌ నుంచి తిరిగివచ్చిన నాటి నుంచి నేను వేరే ఇంట్లో ఉంటున్నాను. పనుల కోసం నేను బయటకు వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి వైరస్‌ బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే వేరుగా ఉంటున్నా. ఇక నా భార్య, కూతురు మాత్రం వాషింగ్టన్‌తోనే ఉంటున్నారు. 

వీడియో కాల్‌ ద్వారా వారితో మాట్లాడుతున్నా. నిజానికి కొన్ని రోజుల తర్వాత నేను ఆఫీస్‌కు వెళ్లాల్సి ఉంటుంది. నా వల్ల తను ఇబ్బంది పడాల్సి వస్తే తట్టుకోలేను. లార్డ్‌ మైదానంలో ఆడటం తన చిరకాల కోరిక. ఎట్టిపరిస్థితుల్లోనూ వాషింగ్టన్‌ ఈ టోర్నీ మిస్‌ కాకుండా చూసుకోవడమే నా లక్ష్యం’’ అని తండ్రి మనసు చాటుకున్నారు. ఇక తమిళనాడులో కరోనా విజృంభణ కొనసాగతున్న సంగతి తెలిసిందే. కాగా జూన్‌ 2న టీమిండియా ఇంగ్లండ్‌కు పయనం కానుంది.

చదవండి: WTC Final: గెలుపే లక్ష్యం.. ఆ సిరీస్‌ కూడా గెలుస్తాం!

మరిన్ని వార్తలు