వర్షం వల్ల టీమిండియా బతికిపోయింది; మీరైతే కళ్లప్పగించి చూడండి!

18 Jun, 2021 19:43 IST|Sakshi

సౌతాంప్టన్‌: వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ తొలి సెషన్‌ రద్దైన నేపథ్యంలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ మరోసారి టీమిండియాపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. వాతావరణం కారణంగా భారత జట్టు బతికిపోయిందంటూ సెటైర్లు వేశాడు. ఇక ఇందుకు టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ తనదైన శైలిలో మరోసారి వాన్‌కు చురకలు అంటించాడు. ‘‘డబ్ల్యూటీసీ ఫైనల్‌ జరుగుతున్న సమయంలో మిగతా జట్లు.. ఇదిగో ఇలా కళ్లప్పగించి చూస్తూ ఉంటాయి’’ అంటూ లగాన్‌ సినిమాలోకు సంబంధించిన ఓ ఫోటోను షేర్‌ చేశాడు. ఇందులో హీరో ఆమిర్‌ ఖాన్‌ తన బృందంతో పొదల మాటు నుంచి తీక్షణంగా చూస్తూ ఉంటాడు. ‘‘టీమిండియా- న్యూజిలాండ్‌ ఫైనల్‌ చేరితే.. నీ జట్టు ఇంగ్లండ్‌ మాత్రం కనీసం తుది వరకు పోరాడలేకపోయింది. ఇరు జట్లకు సిరీస్‌ సమర్పించుకుని వెనుకపడింది’’ అన్న ఉద్దేశంతో వసీం జాఫర్‌ చేసిన ట్వీట్‌ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 

కాగా వర్షం కారణంగా భారత్‌- కివీస్‌ జట్ల మధ్య నేడు ప్రారంభం కావాల్సిన ఫైనల్‌ మ్యాచ్‌ ఆలస్యమవుతోన్న సంగతి తెలిసిందే. ఇక టీమిండియాపై కామెంట్లు చేస్తూ మైకేల్‌ వాన్‌కు ఇటీవల పలుమార్లు ట్రోలింగ్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య టెస్టు సిరీస్‌ నేపథ్యంలో చెన్నై, అహ్మదాబాద్‌ పిచ్‌పై వాన్‌ తీవ్ర విమర్శలు చేసి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఇక ఈ నెలలో న్యూజిలాండ్‌ ఇంగ్లండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న తర్వాత.. ‘‘హైక్లాస్‌ కివీస్‌ టీం.. వచ్చే వారంలో ఇండియాను ఓడిస్తుంది’’ అని జోస్యం చెప్పాడు. ఇందుకు వసీం జాఫర్‌ బదులిస్తూ.. ‘‘నీ పని అయిపోయింది. ఇక వెళ్లు’’అంటూ ఫన్నీ మీమ్‌తో కౌంటర్‌ ఇచ్చాడు.


 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు