WTC Final: చారిత్రక మ్యాచ్‌కు వరుణ గండం..?

16 Jun, 2021 17:04 IST|Sakshi

సౌతాంప్టన్‌: ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారందరికీ ఇదో చేదు వార్త. భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న మెగా పోరుకు వరుణ గండం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రిజర్వు డేతో కలిపి మొత్తం ఆరు రోజులు పాటు మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ సాధ్యాసాధ్యాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో మొట్టమొదటి డబ్ల్యూటీసీ ఫైనల్ కావడంతో.. ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వర్ష గండంపై పొంచి ఉందన్న అంశంపై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్‌ ఓ ట్వీట్‌ చేశాడు. జూన్‌ 18 నుంచి 23 వరకు సౌతాంప్టన్‌లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మ్యాచ్‌కు ఒకరోజు ముందు నుంచే వర్షం మొదలవుతుందని పేర్కొన్నారు. ఇదే జరిగితే మొట్టమొదటి ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ విజేతలుగా భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు సంయుక్తంగా నిలుస్తాయని వెల్లడించాడు. ఇదిలా ఉంటే, వర్షం పడి చల్లటి వాతావరణం ఉంటే మాత్రం కివీస్‌కే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇందుకు 2019 వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌ను ఉదాహరణగా చూపిస్తున్నారు. మరోవైపు ఐసీసీ టోర్నీల్లో కివీస్‌కు టై గండాలు బయపెడుతున్నాయి. గత వన్డే ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్‌ సూపర్‌ ఓవర్లలో స్కోర్లు సమం కావడంతో ఆ జట్టుకు ప్రపంచకప్‌ దక్కకుండా పోయింది. ఇప్పుడు టెస్టు ఛాంపియన్‌షిప్‌లోనూ అలాంటి పరిణామాలే ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ సంయుక్త విజేతను ప్రకటించడం ఆ జట్టుకు ఊరట కలిగించే అంశం.

భారత జట్టు: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌గిల్‌, పుజారా, విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), అజింక్య రహానే(వైస్‌ కెప్టెన్), హనుమ విహారి, రిషభ్‌ పంత్‌(కీపర్‌), సాహా(కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, జస్ప్రిత్‌ బుమ్రా, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌.

కివీస్‌ జట్టు: కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), టామ్‌ బ్లండెల్‌, ట్రెంట్‌ బౌల్ట్, డేవాన్‌ కాన్వే, కోలిన్‌ గ్రాండ్‌హోమ్‌, మాట్ హెన్రీ, కైల్‌ జేమీసన్‌, టామ్‌ లాథమ్‌, హెన్రీ నికోల్స్‌, అజాజ్‌ పటేల్‌, టిమ్‌ సౌథీ, రాస్‌ టేలర్‌, నీల్‌ వాగ్నర్‌, బీజే వాట్లింగ్‌, విల్‌ యంగ్‌.
చదవండి: క్రికెట్‌లోకి రీ ఎంట్రీ అన్నాడు.. అంతలోనే?

మరిన్ని వార్తలు