WTC Final: అద్బుతమైన జట్టుతో ఆడుతున్నాం.. విజయం మాదే

18 Jun, 2021 13:01 IST|Sakshi

సౌతాంప్టన్‌: బ్లాక్‌క్యాప్స్‌ అని ముద్దుగా పిలుచుకునే న్యూజిలాండ్‌ జట్టు అరంగేట్రం నుంచి స్థిరమైన ప్రదర్శన కొనసాగిస్తున్నా.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇంతవరకు ఒక్కసారి కూడా మేజర్‌ టోర్నీని గెలవలేకపోయింది. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన కివీస్‌ను సూపర్‌ఓవర్‌ రూపంలో దురదృష్టం వెంటాడింది. రెండుసార్లు సూపర్‌ ఓవర్‌ టై కావడంతో ఇన్నింగ్స్‌లో ఎక్కువ బౌండరీలు సాధించిన ఇంగ్లండ్‌ జట్టు విశ్వవిజేతగా నిలిచింది. ఇక టెస్టుల్లోనూ నిలకడగా ఆడే న్యూజిలాండ్‌ 2013లో టెస్టు ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో ఉంది.

బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత కేన్‌ విలియమ్సన్‌ నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. అప్పటినుంచి టెస్టుల్లో న్యూజిలాండ్‌ రాత మారుతూ వచ్చింది. ప్రతీ టెస్టు సిరీస్‌లోనూ స్థిరమైన ప్రదర్శన కొనసాగిస్తూ నిలకడగా విజయాలు సాధిస్తూ వచ్చింది. ఓవరాల్‌గా విలియమ్సన్‌ నాయకత్వంలో 36 మ్యాచ్‌ల్లో 21 విజయాలు.. 8 ఓటములు చవిచూసింది. 2019లో ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ షెడ్యూల్‌ ప్రకటించేనాటికి కివీస్‌ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకొని భారత్‌తో చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు సన్నద్ధమయింది.

ఈ నేపథ్యంలో కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ మ్యాచ్‌ ఆరంభానికి కొన్ని గంటల ముందు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.'' డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరడానికి ముందు  ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. 2019లో టెస్టు చాంపియన్‌షిప్‌ షెడ్యూల్‌ ప్రకటించినప్పటినుంచి ఒక్కో చాలెంజ్‌ను ఎదుర్కొంటూ ఇక్కడిదాకా వచ్చాం. తొలిసారి టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడేందుకు సమాయత్తమవుతున్నాం. తొలి చాంపియన్‌షిప్‌ ఎవరు గెలుస్తారనే దానిపై చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభిమానుల సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలాంటి అరుదైన మ్యాచ్‌లో మేము భాగస్వామ్యం కావడం గొప్ప విషయం. మా జట్టు ఇప్పుడు అద్బుతంగా ఉంది. కచ్చితంగా విజయం సాధిస్తామనే నమ్మకంతో ఉన్నాం. నేను మోచేతి గాయం నుంచి రికవరీ అయ్యాను. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ విజయం మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. భారత్‌తో పోలిస్తే మేము కాస్త ముందుగా వచ్చి ప్రాక్టీస్‌ మొదలుపెట్టడం కాస్త సానుకూలాంశం.'' అంటూ చెప్పుకొచ్చాడు. 
చదవండి: WTC Final: ట్రోఫీ టీమిండియానే వరిస్తుంది

మరిన్ని వార్తలు