WTC NZ Vs SL: కివీస్‌తో సిరీస్‌కు లంక జట్టు ప్రకటన.. అదే జరిగితే టీమిండియాతో పాటు ఫైనల్లో!

25 Feb, 2023 09:13 IST|Sakshi
లంక జట్టు (PC: ICC)

New Zealand Vs Sri Lanka 2023- Test Series: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు శ్రీలంక క్రికెట్‌ బోర్డు తమ జట్టును ప్రకటించింది. మార్చి 9 నుంచి ప్రారంభం కానున్న సిరీస్‌కు 17 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ఎంపిక చేసినట్లు తెలిపింది. దిముత్‌ కరుణరత్నె సారథ్యంలోని ఈ జట్టులో లాహిరు కుమార, చమిక కరుణరత్నె, కసున్‌ రజిత, అసిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో తదితరులకు చోటు దక్కింది.

అదే జరిగితే టీమిండియాతో పాటు ఫైనల్లో
కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ) ఫైనల్‌ చేరే క్రమంలో కివీస్‌తో సిరీస్‌ శ్రీలంకకు కీలకంగా మారింది. బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో ఆస్ట్రేలియాను టీమిండియా వరుసగా రెండు టెస్టుల్లో ఓడించడం లంక పాలిట వరంలా మారింది. 

రోహిత్‌ సేన అదే జోరులో ఆసీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడం సహా కివీస్‌ను గనుక లంక వైట్‌వాష్‌ చేస్తే.. సౌతాఫ్రికా- వెస్టిండీస్‌ ఫలితం తమకు అనుకూలంగా వస్తే టీమిండియాతో పాటు ఫైనల్‌ చేరే అవకాశాలు లేకపోలేదు. అయితే, న్యూజిలాండ్‌ గడ్డపై శ్రీలంకకు ఇది కత్తిమీద సాములాంటిదే. 


డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక.. టాప్‌లో కొనసాగుతున్న ఆస్ట్రేలియా

అంత ఈజీ కాదు
గత రికార్డులు పరిశీలిస్తే కివీస్‌తో ముఖాముఖి తలపడిన 19 సందర్భాల్లో శ్రీలంక కేవలం రెండు టెస్టులు మాత్రమే గెలిచింది. అయితే, ప్రస్తుత కోచ్‌ క్రిస్‌ సిల్వర్‌వుడ్‌ మార్గదర్శనంలో లంక జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ ప్రతిభకు అదృష్టం తోడైతే కరుణరత్నె బృందం ఫైనల్‌ చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే, గత డబ్ల్యూటీసీ విన్నర్‌ కివీస్‌ను ఓడించడం అది కూడా సొంత గడ్డపై వైట్‌వాష్‌ చేయడం అంటే ఆషామాషీ కాదు! 

మార్చి9 - ఏప్రిల్‌ 8 వరకు టూర్‌
ఇందుకోసం లంక సర్వశక్తులు ఒడ్డాల్సి ఉంటుంది. కాగా మొట్టమొదటి డబ్ల్యూటీసీ టైటిల్‌ను న్యూజిలాండ్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో టీమిండియాను ఓడించిన కేన్‌ విలియమ్సన్‌ సేన ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. కాగా మార్చి 9- ఏప్రిల్‌ 8 వరకు కివీస్‌- లంక మధ్య రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు జరుగనున్నాయి.

న్యూజిలాండ్‌తో సిరీస్‌కు లంక జట్టు:
దిముత్‌ కరుణరత్నె(కెప్టెన్‌), ఒషాడా ఫెర్నాండో, కుశాల్‌ మెండిస్‌, ఏంజెలో మాథ్యూస్‌, ధనుంజయ డి సిల్వ, దినేశ్‌ చండిమాల్‌, కమిందు మెండిస్‌, నిరోషన్‌ డిక్‌వెల్లా, నిషాన్‌ మదుష్క, రమేశ్‌ మెండిస్‌, ప్రబాత్‌ జయసూర్య, చమిక కరుణరత్నె, కసున్‌ రజిత, లాహిరు కుమార, అషిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో, మిలన్‌ రత్ననాయకె.

చదవండి: T20 WC 2023 Final: సౌతాఫ్రికా క్రికెట్‌ చరిత్రలో తొలిసారి.. ఆఖరి పోరులో ఆసీస్‌తో..
Ind Vs Aus: మూడో టెస్టుకు కమిన్స్‌ దూరం.. బీసీసీఐ ట్వీట్‌! గ్రేట్‌ అంటున్న ఫ్యాన్స్‌

మరిన్ని వార్తలు