మనిక జంటకు కాంస్యం.. సాయిప్రణీత్‌ శుభారంభం.. రెండో రౌండ్‌లో సౌజన్య

31 Mar, 2022 07:32 IST|Sakshi

టేబుల్‌ టెన్నిస్‌లో అదరగొట్టిన మనిక- అర్చన

శుభారంభం అందుకున్న బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ సాయి ప్రణీత్‌

రెండో రౌండ్‌లో ప్రవేశించిన టెన్నిస్‌ ప్లేయర్‌ సౌజన్య బవిశెట్టి

న్యూఢిల్లీ: ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ (డబ్ల్యూటీటీ) దోహా కంటెండర్‌ టోర్నీలో మనిక బత్రా–అర్చన కామత్‌ (భారత్‌) జంట కాంస్య పతకం సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్‌ సెమీఫైనల్లో మనిక–అర్చన ద్వయం 8–11, 6–11, 7–11తో చెంగ్‌ ఐ చింగ్‌–లియు జున్‌ (చైనీస్‌ తైపీ) జోడీ చేతిలో పరాజయం పాలైంది. 20 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో మనిక–అర్చన తమ సర్వీస్‌లో ఏకంగా 16 పాయింట్లు కోల్పోయారు.

ఇతర క్రీడాంశాలు..
సాయిప్రణీత్‌ శుభారంభం 

పారిస్‌: ఓర్లియన్స్‌ మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–100 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత అగ్రశ్రేణి ఆటగాడు సాయిప్రణీత్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన అతను బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో 21–19, 21–12తో జాన్‌ లూడా (చెక్‌ రిపబ్లిక్‌)పై నెగ్గాడు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో కెయుర మోపాటి (భారత్‌) 21–16, 7–21, 15–21తో వెన్‌ జు జాంగ్‌ (కెనడా) చేతిలో పోరాడి ఓడిపోయింది.

రెండో రౌండ్‌లో సౌజన్య 
కాన్‌బెర్రా: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య మహిళల టోర్నీ సింగిల్స్‌ విభాగంలో హైదరాబాద్‌ ప్లేయర్‌ సౌజన్య బవిశెట్టి రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. జో హైవ్స్‌ (ఆస్ట్రేలియా)తో జరిగిన తొలి రౌండ్‌లో సౌజన్య తొలి సెట్‌ను 2–6తో కోల్పోయి, రెండో సెట్‌ను 6–4 తో గెల్చుకుంది. మూడో సెట్‌లో సౌజన్య 1–0 తో ఆధిక్యంలో ఉన్నపుడు ఆమె ప్రత్యర్థి గాయంతో మ్యాచ్‌ నుంచి వైదొలిగింది.

చదవండి: IPL 2022- RCB Vs KKR: బెంగ తీర్చిన హసరంగ 

మరిన్ని వార్తలు