స్టార్‌ క్రికెటర్ల వంతపాట ఆగాలి

15 May, 2021 04:39 IST|Sakshi

సౌరవ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్‌లకు కోచ్‌ రామన్‌ ఈ–మెయిల్‌

న్యూఢిల్లీ: క్రికెట్‌ జట్టులో స్టార్ల మాటే నెగ్గాలనే ఆటలు ఆగాలని భారత మహిళా జట్టు మాజీ కోచ్‌ డబ్ల్యూవీ రామన్‌ అన్నారు. జట్టుపై తన అభిప్రాయాలను జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌ రాహుల్‌ ద్రవిడ్, భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీలకు ఈ–మెయిల్‌లో తెలియజేశారు. ఏ ఒక్క క్రికెటర్‌ పేరు చెప్పకపోయినా... జట్టులో ప్రస్తుతమున్న స్టార్‌ క్రికెటర్‌ అనే సంస్కృతి మారాలని గట్టిగా లేఖలో సూచించినట్లు తెలిసింది. బోర్డు అధ్యక్షుడికి మాజీ కోచ్‌ రామన్‌ ఈ–మెయిల్‌ పంపింది నిజమేనని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.

స్టార్‌ సంస్కృతి జట్టుకు చేటు చేస్తోందని రామన్‌ చెప్పినట్లు తెలిసింది. దీనిపై అధ్యక్షుడు గంగూలీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆ అధికారి తెలిపారు. మొత్తం మీద సీనియర్‌ క్రికెటర్, హైదరాబాదీ స్టార్‌ మిథాలీ రాజ్‌ మళ్లీ వార్తల్లో నిలిచినట్లయింది. పేరు చెప్పకపోయినా ఇప్పుడు అందరికళ్లూ మిథాలీపైనే కేంద్రీకృతమయ్యాయి. మదన్‌లాల్‌ నేతృత్వంలోని క్రికెట్‌ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) గురువారం 42 ఏళ్ల రమేశ్‌ పొవార్‌కు మళ్లీ అమ్మాయిల కోచింగ్‌ బాధ్యతలు అప్పజెప్పింది. 2018లో కోచ్‌గా పనిచేసిన పొవార్‌... మిథాలీతో వివాదం కారణంగా పదవి నుంచి వైదొలిగాడు.

మరిన్ని వార్తలు