MS Dhoni-Roman Reigns: 'ధోని రికార్డులను మా రోమన్‌ రెయిన్స్‌ బద్దలు కొట్టగలడు'

13 Sep, 2022 17:22 IST|Sakshi

డబ్ల్యూడబ్ల్యూఈ(వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌) చూసేవారికి ''పాల్‌ హీమన్‌''(Paul Heyman) అనే వ్యక్తి పరిచయం అక్కర్లేని పేరు. బ్రాక్‌ లెస్నర్‌(Brock Lesnar), రోమన్‌ రెయిన్స్‌(Roman Reigns)కు మేనేజర్‌గా వ్యవహరించాడు. ప్రస్తుతం డబ్ల్యూడబ్ల్యూఈ యునివర్సల్‌ చాంపియన్‌ రోమన్‌ రెయిన్స్‌కు అడ్వైజర్‌ అండ్‌ కౌన్సిల్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న పాల్‌ హీమన్‌ .. టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్‌ ధోని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  

క్రికెట్‌లో ఎంఎస్‌ ధోని నెలకొల్పిన రికార్డులు, నెంబర్స్‌ను మా రోమన్‌ రెయిన్స్‌ బద్దలు కొడతాడంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. అదేంటి అసలు ధోనికి, రోమన్‌ రెయిన్స్‌కు సంబంధం ఏంటి. వీరిద్దరు వేర్వేరు విభాగాలకు చెందిన వాళ్లు కదా. ధోని రికార్డులను రోమన్‌ రెయిన్స్‌ బద్దలు కొట్టడం ఏంటని ఆశ్చర్యపోకండి. కేవలం సరదా కోసమే పాల్‌ హీమన్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు.

విషయంలోకి వెళితే.. సెప్టెంబర్‌ 12న పాల్‌ హీమన్‌ 57వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) పాల్‌ హీమన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. దీనికి బదులుగా పాల్‌ హీమన్‌ థ్యాంక్స్‌ చెప్పి 2019లో వన్డే వరల్డ్‌ కప్‌ సందర్భంగా ఎంఎస్‌ ధోనిని ఉద్దేశించి ఐసీసీ చేసిన ట్వీట్‌ను రీట్వీట్‌ చేశాడు.

ఆ ట్వీట్‌లో ఎంఎస్‌ ధోనిని ఐసీసీ.. ''ఈట్‌.. స్లీప్‌.. ఫినిష్‌ గేమ్స్‌.. రిపీట్‌ @ MS Dhoni'' అంటూ పేర్కొంది. వాస్తవానికి ఐసీసీ ఉపయోగించిన పదాలు పాల్‌ హీమన్‌వే. 2019లో బ్రాక్‌ లెస్నర్‌కు మేనేజర్‌గా వ్యవహరించిన పాల్‌ హీమన్‌.. లెస్నర్‌ను ఉద్దేశించి ''ఈట్‌.. స్లీప్‌.. కాంక్వర్‌.. రిపీట్‌'' అంటూ డబ్ల్యూడబ్ల్యూఈ రింగ్‌లోకి అడుగుపెట్టిన ప్రతీసారి చెప్పేవాడు. ఇది అప్పట్లో సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయింది.

తాజాగా ఐసీసీ ట్వీట్‌ను రీట్వీట్‌ చేసిన పాల్‌ హీమన్‌..''మా డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్‌ రోమన్‌ రెయిన్స్‌ క్రికెట్‌లో అడుగుపెడితే ధోని రికార్డులను, నెంబర్స్‌ను బద్దలు కొట్టడం గ్యారంటీ. ఇది అందరూ తెలుసుకోవాల్సిన నిజం'' అంటూ పేర్కొన్నాడు. 

చదవండి: టి20 ప్రపంచకప్‌కు కొత్త జెర్సీతో బరిలోకి టీమిండియా..

మరిన్ని వార్తలు