Yash Dhull: 18 నెలల్లో టీమిండియాలోకి వస్తా..

10 Feb, 2022 21:16 IST|Sakshi

అండర్‌-19 ప్రపంచకప్‌లో యంగ్‌ ఇండియాను జగజ్జేతగా నిలబెట్టి, రాత్రికిరాత్రి హీరోగా మారిపోయిన యశ్‌ ధుల్‌.. టీమిండియాలో చోటు సంపాదించేందుకు తనకు తాను టార్గెట్‌ను సెట్‌ చేసుకున్నానని తెలిపాడు. మరో 18 నెలల్లో టీమిండియాకు తప్పక ఆడతానని ధీమా వ్యక్తం చేశాడు. ఒకవేళ టార్గెట్‌ను రీచ్‌ కాని పక్షంలో మరింతగా శ్రమిస్తానని, భారత జట్టులో స్థానం సంపాదించడం కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నానని, ఇందుకు తన కుటుంబ సభ్యులు కూడా ప్రిపేరై ఉన్నారని వెల్లడించాడు. ఢిల్లీ రంజీ జట్టు నుంచి పిలుపు అందుకున్న అనంతరం ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ధుల్‌ ఈ విషయాలను ప్రస్తావించాడు. 

టీమిండియా స్టార్‌ ఆటగాడు, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని అమితంగా ఆరాధిస్తానని, అతని అనువనువును రెగ్యులర్‌గా ఫాలో అవుతానని చెప్పిన ధుల్‌.. కోహ్లి తరహాలోనే తన కెరీర్‌ను ప్లాన్‌ చేసుకుంటానని తెలిపాడు. ప్రపంచకప్‌ విజయానంతరం తనపై పెరిగిన అంచనాల దృష్ట్యా ఒత్తిడికి లోనవుతారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించదలచుకోలేదని, దొరికిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని, లక్ష్యం దిశగా సాగడంపైనే తన దృష్టంతా ఉందని చెప్పుకొచ్చాడు. ప్రపంచకప్‌ గెలిచాక కోహ్లితో ఓసారి మాట్లాడానని, అతను తన అండర్‌-19 ప్రపంచకప్‌ అనుభవాలను తనతో పంచుకున్నాడని చెప్పాడు. 

వరల్డ్‌ కప్‌ విజయానంతరం సుదీర్ఘ ప్రయాణాన్ని ముగించుకుని మంగళవారం స్వదేశానికి చేరుకున్నామని, సొంతగడ్డపై అడుగుపెట్టిన నాటి నుంచి రెస్ట్‌ లేకుండా తిరుగుతున్నానని, కొద్ది రోజులు విరామం తీసుకుని రంజీ ప్రాక్టీస్‌లో పాల్గొంటానని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా, ఢిల్లీ నుంచి విరాట్‌ కోహ్లి, ఉన్ముక్త్‌ చంద్‌ల తర్వాత భారత అండర్‌-19 జట్టును విశ్వవిజేతగా నిలిపిన కెప్టెన్‌గా యశ్‌ ధుల్‌ రికార్డుల్లోకెక్కిన విషయం తెలిసిందే. వీరిలో కోహ్లి కెరీర్‌లో అత్యున్నత శిఖరాలను అధిరోహించగా, ఉన్ముక్త్‌ చంద్‌ మాత్రం ఆశించిన ప్రదర్శన కనబర్చలేక కనుమరుగైపోయాడు. 
చదవండి: IPL 2022 : బ్యాడ్‌ న్యూస్‌.. వార్న‌ర్ సహా పలువురు స్టార్‌ క్రికెటర్లు దూరం..?

మరిన్ని వార్తలు