Year End 2021: నిజంగానే అపురూపం.. ఆటల్లో ఎన్నో అద్భుతాలు, మరెన్నో..

31 Dec, 2021 15:44 IST|Sakshi

2021 సంవత్సరం ఈరోజుతో ముగుస్తుంది. కేవలం ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉన్న 2021 సంవత్సరం.. క్రీడల్లో ఎన్నో మధురానుభూతులు.. మరిచిపోలేని విషయాలు.. జ్ఞాపకాలు.. నిరాశ.. ఆధిపత్యం.. వివాదాలు అందించింది. టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రక టెస్టు సిరీస్‌ విజయం మొదలుకొని.. టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్‌ చోప్రా బంగారు పతకంతో భారతావని పులకించడం.. ఇంకా మరెన్నో అద్భుతాలు చోటు చేసుకున్న 2021 సంవత్సరం గురించి చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకం తయారవుతోంది. మరి కాలగమనంలో కలిసి పోనున్న 2021 సంవత్సరంలో క్రీడల్లో జరిగిన ముఖ్య పరిణామాలను మరోసారి గుర్తుచేసుకుందాం. మనం దేశంలో ఎక్కువగా అభిమానించే క్రీడ.. క్రికెట్‌. మరి అలాంటి క్రికెట్‌తోనే 2021 ఏడాది జ్ఞాపకాలను ప్రారంభిద్దాం.
-సాక్షి, వెబ్‌డెస్క్‌ 

ఆస్ట్రేలియాను వారి గడ్డపైనే ఓడించి..
2021 ఏడాదిని టీమిండియా ఘనంగా ఆరంభించింది. అప్పటికే ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా బిజీగా గడుపుతోంది. అడిలైడ్‌ వేదికగా జరిగిన పింక్‌బాల్‌ టెస్టులో టీమిండియా ఘోరమైన ఓటమి చవిచూసింది. 36 పరుగులకే ఆలౌటై దారుణ పరాజయం మూటగట్టుకుంది. దీంతో ఎన్నో అవమానాలు.. విమర్శలు మొదలయ్యాయి. దీనికి తోడూ తొలి టెస్టు తర్వాత వ్యక్తిగత కారణాలతో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్వదేశానికి రావడం.. గాయాలతో కీలక ఆటగాళ్లు దూరం కావడం టీమిండియాను మరింత ఇబ్బందుల్లో పడేసింది. 

కోహ్లి గైర్హాజరీలో రహానే నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. మెల్‌బోర్న్‌ టెస్టులో టీమిండియా  పడిలేచిన కెరటంలా సంచలన విజయం సాధించింది. రహానే జట్టును ముందుండి నడిపించాడు. ఆ తర్వాత సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఓటమికి దగ్గరైంది. ఈ దశలో హనుమ విహారి.. రవిచంద్రన్‌ అశ్విన్‌లు ఆసీస్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని పోరాడడం ప్రతీ ఒక్కరిలో స్పూర్తిని కలిగించింది. ఆసీస్‌ బౌలర్ల దెబ్బలు బాధిస్తున్నా.. వాటిని తట్టుకొని టీమిండియాను ఓటమి నుంచి తప్పించి డ్రాగా ముగించారు. 

ఇక ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ గాబా మైదానానికి రండి మీ పని పడతాం అంటూ సవాల్‌ విసిరాడు. అసలే గాబా మైదానం ఆస్ట్రేలియాకు స్వర్గధామం. 32 ఏళ్లుగా ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాకు అక్కడ ఓటమనేదే లేదు. బుమ్రా, షమీ లాంటి సీనియర్‌ పేసర్ల గైర్హాజరీలో సిరాజ్‌ బౌలింగ్‌ విభాగాన్ని ముందుండి నడిపించాలి. ఇన్ని సవాళ్ల మధ్య బరిలోకి దిగిన టీమిండియా అద్భుతమే చేసి చూపెట్టింది.

ఆ మ్యాచ్‌లో సిరాజ్‌, శార్దూల్‌, పంత్‌, సుందర్‌ల అసమాన పోరాట పటిమతో టీమిండియా అధ్బుత విజయాన్ని నమోదు చేసింది. అలా రహానే సారధ్యంలో టీమిండియా బోర్డ్‌ర్‌ గావస్క్‌ ట్రోఫీని 2-1 తేడాతో సొంతం చేసుకొని చారిత్రక విజయాన్ని అందుకుంది. ఆసీస్‌ను వారి సొంతగడ్డపై వరుసగా రెండోసారి మట్టికరిపించడం అభిమానులను బాగా ఆకట్టుకుంది. అందుకే ఈ సిరీస్‌ విజయం చరిత్రలో నిలిచిపోయింది. అలా 2021 ఏడాదిని టీమిండియా ఘనంగా ఆరంభించింది.

స్వదేశంలో ఇంగ్లండ్‌ను మట్టికరిపించి..


ఇక ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌ నాలుగు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు భారత్‌ గడ్డపై అడుగుపెట్టింది. చెన్నై వేదికగా తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియాకు ఘోర ఓటమి. రూట్‌ నాయకత్వంలోని ఇంగ్లండ్‌ జట్టు తొలి టెస్టులో 227 పరుగుల భారీ తేడాతో గెలిచి సిరీస్‌ను ఘనంగా ఆరంభించింది. దీంతో మళ్లీ విమర్శల పర్వం మొదలైంది. అయితే టీమిండియా మళ్లీ అదే చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టులో బెబ్బులిలా గర్జించింది. 317 పరుగులు భారీ తేడాతో ఇంగ్లండ్‌ను దెబ్బకు దెబ్బ తీసింది. ఇక అక్కడి నుంచి టీమిండియా ఇంగ్లండ్‌కు అవకాశం ఇవ్వలేదు మూడో టెస్టులో 10 వికెట్ల తేడాతో.. నాలుగో టెస్టులో ఇన్నింగ్స్‌ 25 పరుగుల తేడాతో గెలిచి 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌ అశ్విన్‌తో పాటు అక్షర్‌ పటేల్‌కు మధురానుభూతిగా నిలిచిపోయింది. ఈ ఇద్దరు స్పిన్నర్లు ఒకరితో ఒకరు పోటీ పడుతూ వికెట్లు తీశారు. ఇక ఆ తర్వాత జరిగిన ఐదు టి20ల సిరీస్‌ను 3-2 తేడాతో.. మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో ముగించింది.

భారీ అంచనాలతో బరిలోకి.. ఓటములు స్వాగతం పలికాయి


వరుస టెస్టు సిరీస్‌ విజయాలతో జోరు మీదున్న టీమిండియాకు వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ 2021 ఏడాదిలో ఒక చేదు అనుభవం. భారీ అంచనాలతో బరిలోకి దిగిన టీమిండియా.. న్యూజిలాండ్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తొలిసారి నిర్వహించిన డబ్ల్యూటీసీ చాంపిన్‌షిప్‌ టైటిల్‌ను కివీస్‌ సొంతం చేసుకుంటే.. దానిని అందుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఓటమి చవిచూసి అభిమానులను తీవ్ర నిరాశకు గురయ్యేలా చేసింది.

ఇక టి20 ప్రపంచకప్‌ 2021 టైటిల్‌ ఫెవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా ఊసురుమనిపించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే ఓటమి చవిచూడడంతో అభిమానుల ఆగ్రహానికి గురవ్వాల్సి వచ్చింది. కనీసం సెమీస్‌కు చేరకుండానే లీగ్‌ దశలోనే ఇంటిబాట పట్టడంతో టీమిండియా ఆటతీరును.. ఆటగాళ్లను దుమ్మెత్తిపోశారు.  టీమిండియా క్రికెట్‌లో ఈ ప్రపంచకప్‌ ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.

ఇంగ్లండ్‌ గడ్డపై టెస్టు సిరీస్‌లో ఆధిక్యం.. మళ్లీ ఫామ్‌లోకి
డబ్య్లూటీసీ చాంపియన్‌షిప్‌ చేదు అనుభవాన్ని మైమరిపిస్తూ ఇంగ్లండ్‌ గడ్డపై టీమిండియా విజృంభించింది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన నాలుగు టెస్టుల్లో ఒక డ్రా, రెండు గెలిచిన టీమిండియా 2-1తో స్పష్టమైన ఆధిక్యంలోకి వచ్చింది. చివరి టెస్టును డ్రా చేసుకున్నా చాలు టీమిండియా మరో సిరీస్‌ గెలిచి చరిత్ర సృష్టించడానికి. అయితే కరోనా కారణంగా ఐదో టెస్టు మ్యాచ్‌ను ఈసీబీ వాయిదా వేసింది. అయితే ఈ టెస్టు వాయిదాపై విభిన్న వాదనలు వినిపించాయి. ఇంగ్లండ్‌ సిరీస్‌ ఓటమి నుంచి తప్పించుకునేందుకే ఇలా చేసిందంటూ టీమిండియా ఫ్యాన్స్‌ గోల చేశారు. అయితే వచ్చే ఏడాది జూన్‌లో ఈ టెస్టు మ్యాచ్‌ను నిర్వహిస్తామని ఈసీబీ తెలపడంతో వివాదం సద్దుమణిగింది.

డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఓటమికి ప్రతీకారం
నవంబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 1-0 తేడాతో గెలుచుకుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఓటమికి కివీస్‌పై ప్రతీకారం తీర్చుకొని అభిమానులకు కాస్త ఊరట కలిగించింది. 

సౌతాఫ్రికా గడ్డపై అపరూప విజయం


ఈసారి ఎలాగైనా సౌతాఫ్రికా గడ్డపై సిరీస్‌ గెలవాలనే పట్టుదలతో అడుగుపెట్టిన టీమిండియా సెంచూరియన్‌లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. బాక్సింగ్‌ డే టెస్టుగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా సౌతాఫ్రికాపై 113 పరుగుల తేడాతో గెలిచి ప్రొటీస్‌ గడ్డపై నాలుగో విజయాన్ని అందుకుంది. సెంచూరియన్‌లో ఇప్పటివరకు ఓటమి ఎరుగని దక్షిణాఫ్రికాను మట్టికరిపించిన టీమిండియా విజయంతోనే ఏడాదిని ముగించడం విశేషం. ఇక మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఏ ఒక్కటి గెలిచినా.. టీమిండియా కల సాకారమైనట్లే. 

కోహ్లి కెప్టెన్సీ వివాదం:
ప్రశాంతంగా సాగిపోతున్న భారత్‌ క్రికెట్‌లో బీసీసీఐ, విరాట్‌ కోహ్లి మధ్య వివాదం 2021లో పెద్ద సంచలనం. టి20 ప్రపంచకప్‌ తర్వాత ఆ ఫార్మాట్‌లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకున్నాడు. దీంతో రోహిత్‌ శర్మకు టి20 బాధ్యతలు అప్పగించింది. అయితే కొన్ని రోజుల తర్వాత వన్డే, టి20లకు వేర్వేరు కెప్టెన్లు ఉండడం మంచిది కాదని బీసీసీఐ అభిప్రాయపడింది. ఈ అంశంమే ఆ తర్వాత వివాదానికి దారి తీసింది. అందుకు అనుగుణంగా కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించి రోహిత్‌ను వన్డే సారధిగా నియమించింది. ఈ విషయంలో కోహ్లికి ముందే సమాచారం ఇచ్చామని బీసీసీఐ తెలిపింది.

సౌతాఫ్రికా టూర్‌కు బయలుదేరే ఒక్కరోజు ముందు కోహ్లి మీడియా ముందుకు బాంబు పేల్చాడు. వన్డే కెప్టెన్సీ తొలగింపు విషయమై.. బీసీసీఐ తనకు గంటన్నర ముందు చెప్పిందని.. టి20 కెప్టెన్సీ నుంచి దిగిపోవద్దంటూ తననెవరు ఆపలేదని.. గంగూలీ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదంటూ కుండబద్దలు కొట్టాడు. దీంతో కోహ్లి-బీసీసీఐ వివాదం రచ్చగా మారింది. కోహ్లి వివాదంపై గంగూలీ కూడా మాట దాటవేస్తూ.. ఈ విషయాన్ని బీసీసీఐ చూసుకుంటుందని తెలపడం గమనార్హం. ఇంతలో టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు బయలుదేరడంతో వివాదానికి తాత్కాలిక తెర పడింది.

క్రికెట్‌లో సంచలనాలు, ఆధిపత్యం:


2021 ఏడాదిలో క్రికెట్‌లో మరెన్నో సంచలనాలు నమోదయ్యాయి. టి20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్తాన్‌, స్కాట్లాండ్‌, నమీబియా లాంటి చిన్న దేశాలు అద్బుతాలు చేశాయి. ఇక ఆస్ట్రేలియా తొలిసారి పొట్టి ఫార్మాట్‌లో చాంపియన్‌గా అవతరించగా.. కివీస్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఇక యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యం చూపించింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో వరుసగా మూడు టెస్టుల్లోనూ విజయాలు అందుకొని 3-0 తేడాతో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. 

ఈ ఏడాది టెస్టు క్రికెట్‌లో న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ ఎజాజ్‌ పటేల్‌ సంచలనం సృష్టించాడు. టీమిండియాతో జరిగిన ఒక టెస్టులో ఒక ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో ఈ ఘనత ఇంతకముందు ఇద్దరి పేరిట మాత్రమే ఉంది. టీమిండియా లెజెండరీ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే, ఇంగ్లండ్‌ దిగ్గజ బౌలర్‌ జిమ్‌ లేఖర్‌లు మాత్రమే టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో పదికి 10 వికెట్లు తీశారు. తాజాగా ఎజాజ్‌ పటేల్‌ ఆ ఫీట్‌ను అందుకొని దిగ్గజాల సరసన నిలిచాడు. ఇక క్రికెట్‌ బతికున్నంతవరకు ఎజాజ్‌ పటేల్‌ పేరు  చరిత్ర పుటల్లో నిలవడం ఖాయం.

ఇక ఐపీఎల్‌ 2020లో చెత్త ప్రదర్శన చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ 2021 ఐపీఎల్‌ సీజన్‌లో మాత్రం దుమ్మురేపింది. కేకేఆర్‌తో జరిగిన ఫైనల్లో ధోని సేన 27 పరుగుల తేడాతో విజయం సాధించి నాలుగోసారి ఐపీఎల్‌ టైటిల్‌ను దక్కించుకుంది. ఓవరాల్‌గా అత్యధిక ఐపీఎల్‌ టైటిల్స్‌ గెలిచిన జట్టుగా( ముంబై ఇండియన్స్‌ ఐదుసార్లు తొలిస్థానం) సీఎస్‌కే రెండో స్థానంలో ఉంది.

టోక్యో ఒలింపిక్స్‌.. ''బంగారు'' నీరజ్‌ చోప్రా.. భారతావని పులకించినవేళ
కరోనా కారణంగా ఏడాది పాటు వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్‌ జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరిగాయి. కోటి ఆశలతో బరిలోకి దిగిన భారత్‌.. ఈసారైనా మంచి ప్రదర్శనతో ఎక్కువ పతకాలు కొల్లగొడుతుందా లేక మన పద్దతిలో రెండు లేదా మూడు పతకాలు వస్తాయా అనే భావించారు. దీనికి తగ్గట్టుగానే రోజులు గడుస్తున్నాయి.. భారత అథ్లెట్లు మంచి ప్రదర్శన చేసినప్పటికి పసిడి పతకం మాత్రం రాలేదు. ఈసారి కూడా మనవాళ్లు స్వర్ణం లేకుండానే వెనుదిరుగుతారా అని అంతా అనుకున్నారు. కానీ అప్పుడే ఒక అద్భుతం చోటుచేసుకుంది.

ఏ మాత్రం అంచనాలు లేని అథ్లెటిక్స్‌లో జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రా చరిత్ర సృష్టించాడు. జావెలిన్‌ త్రోలో తొలిసారే ఈటెను ఏకంగా 87.58 మీటర్ల దూరం విసిరి స్వర్ణం ఖరారు చేసుకున్నాడు. అతని దరిదాపుల్లోకి కనీసం ఒక్కరు కూడా రాలేకపోవడంతో బంగారు పతకం నీరజ్‌ చోప్రా వశమైంది. స్వతంత్ర భారతావనికి అథ్లెటిక్స్‌ విభాగంలో తొలి స్వర్ణం అందించడే గాకుండా వ్యక్తిగత విభాగంలో రెండో బంగారు పతకం.. అథ్లెటిక్స్‌లో తొలి పతకం సాధించిన నీరజ్‌ చోప్రా చరిత్ర పుటల్లో నిలిచిపోయాడు. అతని విజయంతో 130 కోట్ల భారతీయుల హృదయాలు గర్వంతో ఉప్పొంగిపోయాయి.

ఇక ఈసారి ఒలింపిక్స్‌లో ఎలాగైనా స్వర్ణం సాధిస్తాననే ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన భారత మహిళ షట్లర్‌ పీవీ సింధు నిరాశపరిచినప్పటికి.. కాంస్యంతో మురిపించింది. భారత ఒలింపిక్స్‌ చరిత్రలో రెండు పతకాలు(2016లో రజతం) సాధించిన తొలి భారత మహిళ అథ్లెట్‌గా సింధు చరిత్ర సృష్టించింది. ఇక వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాభాయి చాను 49 కేజీల విభాగంలో రజతం సాధించి.. కరణం మళ్లీశ్వరీ తర్వాత వెయిట్‌లిఫ్టింగ్‌లో పతకం సాధించిన మహిళగా మీరాభాయి చరిత్ర లిఖించింది. మహిళల బాక్సింగ్‌ 49 కేజీల విభాగంలో ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి కాంస్యం గెలిచిన లవ్లీనా బొర్హంగైన్‌ అందరికి ఆదర్శంగా నిలిచింది. ఇక రెజ్లింగ్‌లో రవికుమార్‌ దహియా రజతం.. భజరంగ్‌ పూనియా కాంస్యం గెలిచి రెజ్లింగ్‌లో మనకున్న పట్టను రెట్టింపు చేశారు.

హాకీలో పూర్వ వైభవం..


ఒకప్పుడు ఒలింపిక్స్‌లో స్వర్ణయుగం చూసిన భారత హాకీ జట్టు ఆట క్రమంగా మసకబారుతూ వచ్చింది. అయితే టోక్యో ఒలింపిక్స్‌లో మాత్రం అంచనాలుకు భిన్నంగా టీమిండియా హాకీ పరుషుల జట్టు రాణించింది. ఫైనల్‌కు చేరడంలో విఫలమైనప్పటికి 41 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ భారత పురుషుల హాకీ జట్టు కాంస్యం గెలిచి హాకికి పునర్వైభవం తెచ్చింది. ఈ విజయంతో భారతీయ అభిమానుల గుండెలు ఉప్పొంగిపోయాయి. ఇక భారత మహిళల హాకీ జట్టు పోరాటం కూడా మరువలేనిది. ఒలింపిక్స్‌లో మహిళల హాకీ విభాగంలో నాలుగోస్థానంలో నిలిచినప్పటికి మన మహిళల పోరాటం అందరికి స్పూర్తిదాయకం.

ఇక మొత్తంగా టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ అద్వితీయ ప్రదర్శనతో మెప్పించింది. మొత్తం ఏడు పతకాలతో ఒలింపిక్స్‌ చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శనతో పోటీలను ముగించడం విశేషం. ఇక టోక్యో వేదికగా జరిగిన పారా ఒలింపిక్స్‌లోనూ భారత పారాఅథ్లెట్లు దుమ్మురేపారు. ఐదు స్వర్ణాలు సహా మొత్తం 19 పతకాలు సాధించి చరిత్ర సృష్టించారు.

ఇతర క్రీడల్లో వివాదాలు..


క్రికెట్‌లాగే ఇతర క్రీడల్లోనూ వివాదాలు చెలరేగాయి. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో(2008లో కాంస్యం, 2012లో రజతం) పతకాలతో మురిపించిన రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ హత్యకేసులో ఇరుక్కోవడం సంచలనం రేపింది. ఢిల్లీలోని ఛత్రసాల్‌ స్టేడియంలో సుశీల్‌ నేతృత్వంలో జరిగిన దాడిలో యువ రెజ్లర్‌ సాగర్‌ మృతి చెందడం కలకలం రేపింది. హత్య ఆరోపణలతో ప్రస్తుతం సుశీల్‌ కుమార్‌ తీహర్‌ జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడు.

చైనా ప్రభుత్వ మాజీ అధికారి తనను లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు చేసిన చైనా టెన్నిస్‌ క్రీడాకారిణి పెంగ్‌ షువాయి ఆచూకీ కనిపించకుండా పోవడం సంచలనం సృష్టించింది. ఆమె జాడ కనిపెట్టాలంటూ క్రీడాలోకం గొంతెత్తింది. అయితే కొన్ని రోజులకు తాను సురక్షితంగానే ఉన్నానని.. పెంగ్‌ షువాయి మాట్లాడిని మాటలను వీడియో రూపంలో చైనా ప్రభుత్వం విడుదల చేయడం ఆశ్చర్యం కలిగించింది. అయితే దీనిలో నిజమెంత అనేది ఇప్పటికి తెలియరాలేదు. మరోవైపు పెంగ్‌ షువాయి ఆచూకీ కనిపెట్టాలని.. ఆమె చేసిన ఆరోపణల్లో నిజాలను తేల్చాలంటూ చైనా ప్రభుత్వాన్ని క్రీడాసంఘాలు డిమాండ్‌ చేశాయి. దీనికి తూడు పెంగ్‌ షువాయి కేసు విచారణను పారదర్శకంగా నిర్వహించాలఇ డిమాండ్‌ చేస్తు.. ఆ దేశంతో పాటు హాంకాంగ్‌లో డబ్ల్యూటీఏ(అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య) టోర్నీలను నిలిపివేసింది.

విషాదాలు..
ప్రతీ ఏడాదిలాగే 2021లోనూ క్రీడల్లో విషాదాలు నెలకొన్నాయి.  భారత అథ్లెటిక్స్‌లో చెరగని ముద్ర వేసిన ''ఫ్లయింగ్‌ సిఖ్‌'' మిల్కా సింగ్‌ ఈ ఏడాది జూన్‌లో కన్నుమూశారు. 1960 రోమ్‌ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగు పందెంలో తృటిలో పతకం చేజార్చుకున్న మిల్కా సింగ్‌ మృతి పట్ల యావత్‌ దేశం విచారం వ్యక్తం చేసింది. 

1983 వన్డే ప్రపంచకప్‌ సాధించిన టీమిండియా జట్టులో సభ్యుడిగా ఉ‍న్న యశ్‌పాల్‌ శర్మ ఈ ఏడాదే కన్నుమూశారు. ఉదయం వాకింగ్‌కు వెళ్లి ఇంటికి వచ్చిన కాసేపటికే గుండెపోటుకు గురై మరణించారు. టీమిండియా తరపున యశ్‌పాల్‌ శర్మ 37 టెస్టులు, 42 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించారు.

ఇక భారత హాకీ దిగ్గజాలు ఎంకే కౌషిక్‌, రవీందర్‌పాల్‌ సింగ్‌లు ఒకేరోజు కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆసియా క్రీడల బాక్సింగ్‌ చాంపియన్‌ డింకూ సింగ్‌ కూడా ఈ ఏడాదిలోనే కన్నుమూశారు.

2021లో చోటుచేసుకున్న మరిన్ని ముఖ్య విషయాలు:


భారత్‌ మహిళల క్రికెట్‌కు గర్వంగా నిలిచిన మిథాలీ రాజ్‌ ఈ ఏడాది ఒక గొప్ప రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ మహిళల క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన తొలి బ్యాటర్‌ నిలిచింది. ఇప్పటివరకు మూడు ఫార్మాట్లు కలిపి మిథాలీ రాజ్‌ 321 మ్యాచ్‌ల్లో 10,454 పరుగులు సాధించింది.

పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో ఈ ఏడాదిలో ఒక సంచలనం నమోదు చేశాడు. ఫుట్‌బాల్‌ చరిత్రలో అంతర్జాతీయంగా అత్యధిక గోల్స్‌ చేసిన జాబితాలో రొనాల్డో తొలి స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు రొనాల్డో పోర్చుల్‌ తరపున 184 మ్యాచ్‌ల్లో 115 గోల్స్‌ చేశాడు. ఇక భారత ఫుట్‌బాల్‌ కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి.. అర్జెంటీనా స్టార్‌ మెస్సీతో కలిసి 80 అంతర్జాతీయ గోల్స్‌తో ఐదో స్థానంలో నిలవడం విశేషం.

ఇక బ్యాడ్మింటన్‌ విభాగంలో కిడాంబి శ్రీకాంత్‌ అద్భుతం సృష్టించాడు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచి  ఈ ఘనత సాధించిన తొలి భారత షెట్లర్‌గా చరిత్ర  సృష్టించాడు. ఇదే టోర్నీలో లక్ష్యసేన్‌ కాంస్యం గెలవడం మరో విశేషం.

జిమ్నాస్టిక్స్‌లో తనదైన ముద్ర వేసిన సిమోన్‌ బైల్స్‌ ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో మానసిక, ఆరోగ్య సమస్యలతో  తప్పుకోవడం సంచలనం సృష్టించింది. అయితే ఆ తర్వాత బ్యాలెన్స్‌ బీమ్‌లో బరిలోకి దిగి కాంస్యం గెలిచింది.. ఇక క్రికెటర్లు బెన్‌ స్టోక్స్‌, క్రిస్‌గేల్‌.. మహిళల టెన్నిస్‌ స్టార్‌ నయామి ఓసాకా మానసిక ఒత్తిడితో కొంతకాలం ఆటకు బ్రేక్‌ తీసుకున్నారు.

టెన్నిస్‌లో ఈ ఏడాది జకోవిచ్‌కు బాగా కలిసి వచ్చింది. ఆడిన నాలుగు గ్రాండ్‌స్లామ్స్‌లో జకోవిచ్‌ మూడు టైటిళ్లు సాధించాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌,ఫ్రెంచ్‌ ఓపెన్‌, వింబుల్డన్‌ను సొంతం చేసుకున్న జకోవిచ్‌ ఆఖరిదైన యూఎస్‌ ఓపెన్‌లో మాత్రం మెద్వదేవ్‌ చేతిలో ఓటమిపాలయ్యాడు.

మరిన్ని వార్తలు