Year Ender 2022: వాటిలో హిట్టే! అసలైన పోరులోనే తుస్సు.. కొందరికి మోదం, కొందరికి ఖేదం!

30 Dec, 2022 15:36 IST|Sakshi

Roundup 2022- Team India: భారత పురుషుల క్రికెట్‌కు 2022లో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ద్వైపాక్షిక సిరీస్‌లలో అదరగొట్టిన టీమిండియా ప్రధాన ఈవెంట్లలో మాత్రం ఉసూరుమనిపించింది. ఇక ఆటగాళ్ల విషయానికొస్తే.. ఈ ఏడాది ఆరంభంలో విరాట్‌ కోహ్లి టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోగా..  శ్రీలంకతో సిరీస్‌తో రోహిత్‌ శర్మ టెస్టు సారథిగా ప్రయాణం మొదలుపెట్టాడు. 

కోహ్లి అలా, రోహిత్‌ ఇలా..! నంబర్‌ 1 సూర్య
అయితే, సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్న కోహ్లి ఆసియా కప్‌ టోర్నీలో భాగంగా.. కెరీర్‌లో 71వ సెంచరీ నమోదు చేశాడు. కానీ, హిట్‌మ్యాన్‌కు మాత్రం వ్యక్తిగతంగా ఈ ఏడాది కలిసిరాలేదు. గాయాలతో అతడు సావాసం చేయాల్సి వచ్చింది.

ఈ క్రమంలో వన్డే కెప్టెన్‌గా ఎంపికైన ప్రొటిస్‌తో తొలి సిరీస్‌కు దూరమైన రోహిత్‌.. డిసెంబరులో బంగ్లాదేశ్‌ పర్యటననూ గాయంతోనే ముగించాడు. ఇక కెప్టెన్‌గా ద్వైపాక్షిక సిరీస్‌లలో సత్తా చాటగలిగిన రోహిత్‌ శర్మ.. ఆసియా కప్‌-2022, టీ20 ప్రపంచకప్‌- 2022 టోర్నీల్లో టీమిండియా విఫలం కావడంతో విమర్శలు మూటగట్టుకున్నాడు. మరోవైపు.. ముంబై బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌ 1 ర్యాంకు సాధించి సత్తా చాటాడు.
చదవండి: సూర్యకుమార్‌ యాదవ్‌.. ఈ ఏడాది టీ20ల్లో ప్రకంపనలు సృష్టించిన టీమిండియా డైనమైట్‌

ఇక జట్టు విషయానికొస్తే..
2022లో టీమిండియా న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌, ఐర్లాండ్‌, శ్రీలంక, వెస్టిండీస్‌, జింబాబ్వే, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా తదితర దేశాలతో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడింది. టెస్టుల్లో 3, వన్డేల్లో 8, టీ20లలో 9 సిరీస్‌లో ప్రత్యర్థి జట్లను ఢీకొట్టింది. వీటిలో 15 విజయాలు ఉండటం విశేషం. టెస్టుల్లో రెండు, వన్డేల్లో ఐదు, టీ20లలో 8 సిరీస్‌ విజయాలు(సౌతాఫ్రికాతో స్వదేశంలో డ్రా మినహా) నమోదు చేసింది. 

గాయాల బెడద
ఈ ఏడాది గాయం కారణంగా పలు సందర్భాల్లో జట్టుకు దూరమైన ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజా, దీపక్‌ చహర్‌, మహ్మద్‌ షమీ, కుల్దీప్‌ సేన్‌ తదితరులు. ఇక రోహిత్‌ ఫిట్‌నెస్‌ సమస్యలు, విశ్రాంతి పేరిట దూరం కావడం, జట్టు ఒకేసారి రెండేసి దేశాల్లో పర్యటించడం వంటి కారణాల నేపథ్యంలో కెప్టెన్లు మారారు. రోహిత్‌ సహా కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యా, శిఖర్‌ ధావన్‌, రిషభ్‌ పంత్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, అజింక్య రహానే వివిధ సందర్భాల్లో సారథులుగా వ్యవహరించారు.

గంగూలీ అవుట్‌
కోహ్లికి వన్డే కెప్టెన్సీ నుంచి ఉద్వాసన పలకడంతో బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ విమర్శల పాలయ్యాడు. జట్టు ఎంపిక విషయంలో జోక్యం చేసుకుంటున్నాడనే అపవాదు మూటగట్టుకున్నాడు.

ఈ పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగాలన్న దాదా ఆశ నెరవేరలేదు. గంగూలీ స్థానంలో రోజర్‌ బిన్నీ బీసీసీఐ 36వ ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అయితే, జై షా మాత్రం కార్యదర్శిగానే కొనసాగడం గమనార్హం.

యువ నాయకత్వం చేతుల్లోకి టీమిండియా
మేజర్‌ టోర్నీల్లో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రోహిత్‌ విఫలం కావడంతో అతడిని తప్పించాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీ20 కెప్టెన్‌గా ఉన్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా.. పూర్తి స్థాయిలో పరిమిత ఓవర్ల నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంది.

అదే విధంగా టెస్టుల్లో కీలక సభ్యుడైన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ను రోహిత్‌ తర్వాత నాయకుడిని చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

చదవండి: Rishabh Pant Accident: వేగంగా దూసుకొచ్చిన కారు.. సీసీటీవీ ఫుటేజీ వైరల్‌! ప్రమాదానికి కారణం అదేనా?

మరిన్ని వార్తలు