కాంస్యంతో జ్యోతి జాతీయ రికార్డు

5 Aug, 2023 04:00 IST|Sakshi

చెంగ్డూ (చైనా): భారత స్టార్‌ అథ్లెట్, ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి జ్యోతి యర్రాజీ మరో ఘనత సాధించింది. ప్రపంచ విశ్వ విద్యాలయాల క్రీడల్లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో పతకం నెగ్గిన తొలి భారతీయ అథ్లెట్‌గా నిలిచింది. శుక్రవారం జరిగిన మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌ ఫైనల్‌ రేసును విశాఖపట్నం జిల్లాకు చెందిన 23 ఏళ్ల జ్యోతి 12.78 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.

ఈ క్రమంలో 12.82 సెకన్లతో గత ఏడాది తానే నెలకొల్పిన జాతీయ రికార్డును జ్యోతి బద్దలు కొట్టింది. గత నెలలో ఆసియా చాంపియన్‌గా నిలిచిన జ్యోతి తదుపరి ఈనెల మూడో వారంలో హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిలో పోటీపడుతుంది.

అథ్లెటిక్స్‌లో శుక్రవారమే భారత్‌ ఖాతాలో రెండో పతకం చేరింది. పురుషుల 200 మీటర్ల విభాగంలో అమ్లాన్‌ బొర్గోహైన్‌ కాంస్య పతకం సాధించాడు. అమ్లాన్‌ 20.55 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం భారత జట్టు 11 స్వర్ణాలు, 5 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి మొత్తం 25 పతకాలతో నాలుగో స్థానంలో ఉంది.   

>
మరిన్ని వార్తలు