పొలార్డ్‌ గ్యాంగ్‌పై షారుక్‌ ప్రశంసలు

11 Sep, 2020 13:12 IST|Sakshi

న్యూఢిల్లీ: ఈ సీజన్‌ కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌)లో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోకుండా టైటిల్‌ గెలుచుకున్న ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌  ఆటగాళ్లపై ఫ్రాంచైజీ యాజమాని, బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ ప్రశంసలు కురిపించాడు.  ‘ఈ సీపీఎల్‌ను మనం శాసించాం. సమష్టి కృషితోనే అది సాధ్యమైంది. మాకు మీరు గర్వకారణం. ఈ విజయాన్ని వేడుకగా జరుపుకుందాం. అదే సమయంలో ఎటువంటి జన తాకిడి లేకుండా పార్టీ చేసుకుందాం. ఇది పర్‌ఫెక్ట్‌ 12( మొత్తం మ్యాచ్‌లు గెలవడంపై). ఇక ఐపీఎల్‌కు రండి. పొలార్డ్‌ గ్యాంగ్‌ ధన్యవాదాలు. ప్రత్యేకంగా డ్వేన్‌ బ్రేవో, డారెన్‌ బ్రేవో, పొలార్డ్‌లకు నా అభినందనలు. ఇది నైట్‌రైడర్స్‌కు నాల్గో టైటిల్‌. లవ్‌ యూ’ అని షారుక్‌ ట్వీట్‌ చేశాడు.

నిన్న జరిగిన సీపీఎల్‌ ఫైనల్‌ పోరులో ట్రిన్‌బాగో 8 వికెట్ల తేడాతో సెయింట్‌ లూసియా జూక్స్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జూక్స్‌ 19.1 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. ఆండ్రీ ఫ్లెచర్‌ (27 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్‌స్కోరర్‌గా నిలవగా...కీరన్‌ పొలార్డ్‌ (4/30) చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేశాడు. అనంతరం నైట్‌రైడర్స్‌ 18.1 ఓవర్లలో 2 వికెట్లకు 157 పరుగులు సాధించింది. లెండిన్‌ సిమన్స్‌ (49 బంతుల్లో 84 నాటౌట్‌; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), డారెన్‌ బ్రావో (47 బంతుల్లో 58 నాటౌట్‌; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు బ్యాటింగ్‌తో జట్టును గెలిపించారు.  డారెన్‌ బ్రావో ఫోర్‌ కొట్టడంతో నైట్‌రైడర్స్‌ టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. ఇది ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు నాల్గో టైటిల్‌.  ఫలితంగా సీపీఎల్‌ చరిత్రలో అత్యధిక టైటిల్స్‌ గెలిచిన జట్టుగా నైట్‌రైడర్స్‌ నిలిచింది. నైట్‌రైడర్స్‌ జట్టుకు పొలార్డ్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా డ్వేన్‌ బ్రేవో, డారెన్‌ బ్రావో, సిమ్మన్స్‌ వంటి స్టార్లు ఆ జట్టులో ఉన్నారు. (చదవండి: ‘ఆ గన్‌ ప్లేయర్‌తో రైనా స్థానాన్ని పూడుస్తాం’)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు