పాక్‌ క్రికెట్‌లో ముసలం.. బాధ్యతల నుంచి తప్పుకున్న యూనిస్‌ ఖాన్‌

22 Jun, 2021 15:35 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో ముసలం మొదలైనట్లు కనబడుతోంది. జట్టు ఎంపిక విషయంలో తనను సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపిస్తూ జట్టు ప్రధాన బ్యాటింగ్‌ కోచ్‌ పదవికి దిగ్గజ ఆటగాడు యూనిస్‌ ఖాన్‌ రాజీనామా చేశాడు. అయితే, కోచ్‌ పదవి నుంచి తప్పుకోవడానికి గల కారణాలను అధికారికంగా వెల్లడించేందుకు ఆయన అయిష్టత వ్యక్తం చేశాడు. పాక్‌ జట్టు త్వరలో ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌లలో పర్యటించనున్న నేపథ్యంలో యూనిస్‌ ఖాన్‌ కోచ్‌ పదవికి రాజీనామా చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

కాగా, బ్యాటింగ్ కోచ్ లేకుండానే పాక్ జ‌ట్టు ఇంగ్లండ్‌, విండీస్ టూర్లకు వెళ్లనున్నట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు ఓ ప్రక‌ట‌న‌లో తెలిపింది. మరోవైపు యూనిస్‌ లాంటి దిగ్గజ ఆటగాడి సేవలను కోల్పోవడం పాక్‌కు పెద్ద లోటేన‌ని పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వాసిమ్ ఖాన్ వెల్లడించారు. కాగా, యూనిస్‌ ఖాన్‌ పాక్‌ తరఫున 118 టెస్ట్‌లు, 265 వన్డేలు, 25 టీ20 మ్యాచ్‌లు ఆడి 41 సెంచరీలు, 81 అర్ధసెంచరీల సాయంతో దాదాపు 18000 పరుగులను సాధించాడు. యూనిస్‌ ఖాన్‌ ఖాతాలో ఓ ట్రిపుల్‌ హండ్రెడ్‌ కూడా ఉంది. 

ఇదిలా ఉంటే, పాక్‌ జట్టు.. ఈ నెల 25వ తేదీ నుంచి ఇంగ్లండ్‌లో ప‌ర్యటించ‌నుంది. జూలై 20 వ‌ర‌కు సాగే ఈ పర్యటనలో పాక్‌, ఇంగ్లండ్‌తో మూడు వ‌న్డేలు, మూడు టీ20లు ఆడనుంది. అనంతరం పాక్‌ అక్కడి నంచే నేరుగా వెస్టిండీస్ పర్యటనకు బయల్దేరుతుంది. జూలై 21 నుంచి ఆగ‌స్టు 24 వ‌ర‌కు సాగే ఈ పర్యటనలో పాక్‌ 5 టీ20లు, రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. 
చదవండి: WTC ఫైనల్‌: విరాట్ కోహ్లి డ్యాన్స్‌ అదిరిందిగా!

మరిన్ని వార్తలు