విజయసాయిరెడ్డి నోట క్రికెట్‌ మాట.. టెస్ట్‌ ఫార్మాట్‌పై ఐసీసీకి పలు సూచనలు

11 Aug, 2022 08:54 IST|Sakshi

నిత్యం రాజకీయాల్లో బిజీబిజీగా ఉండే వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. తొలిసారి రాజకీయేతర అంశాలపై స్పందించారు. ట్విటర్‌ వేదికగా క్రికెట్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టెస్ట్‌ క్రికెట్‌ మనుగడపై అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌కు (ఐసీసీ)  పలు సూచనలు చేశారు. టీ20 క్రికెట్ అంటే మనందరికీ ఇష్టమంటూనే, పొట్టి క్రికెట్‌ మోజులో పడి ట్రెంట్‌ బౌల్ట్, క్వింటన్‌ డికాక్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు టెస్టులకు దూరం కావడం విచారకరమని అన్నారు. 

ఆటగాళ్లు టీ20ల కోసం సుదీర్ఘ ఫార్మాట్‌ను నిర్లక్ష్యం చేయకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఐసీసీకి సూచించారు. స్వచ్ఛమైన క్రికెట్‌కు ప్రతిరూపమైన టెస్ట్‌ ఫార్మాట్‌ నుంచి అగ్రశ్రేణి ఆటగాళ్లు వైదొలగకుండా చూడాల్సిన బాధ్యత ఐసీసీపై ఉందన్నారు. టెస్ట్‌ క్రికెట్ వైభవం పది కాలాల పాటు పదిలంగా ఉండేలా చూడాలని కోరారు. ఈ అంశంపై ఐసీసీ ప్రత్యేకమైన దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.  
చదవండి: 9 నెలల గర్భంతో కాంస్య పతకం.. శభాష్‌ అంటున్న క్రీడాలోకం

మరిన్ని వార్తలు