పూర్వపు రోజులను గుర్తు తెస్తున్న క్రికెట్‌ దిగ్గజాలు

13 Mar, 2021 21:28 IST|Sakshi

న్యూఢిల్లీ: రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌-2021లో భాగంగా దక్షిణాఫ్రికా లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత దిగ్గజ ఆటగాళ్లు సచిన్‌ టెండూల్కర్‌, యువరాజ్‌ సింగ్‌లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇండియా లెజెండ్స్‌.. సచిన్‌ టెండూల్కర్‌ (37 బంతుల్లో 60; 9 ఫోర్లు, సిక్స్‌), యువరాజ్‌ సింగ్‌ (22 బంతుల్లో 52; 2 ఫోర్లు, 6 సిక్స్‌లు)ల  వీరవిహారం ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోర్‌ను సాధించారు. వీరికి వన్‌డౌన్‌ బ్యాట్స్‌మెన్‌ బద్రీనాథ్‌ (34 బంతుల్లో 42 రిటైర్డ్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), యూసఫ్‌ పఠాన్‌ (10 బంతుల్లో 23; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు కూడా తోడవడంతో టీమిండియా ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.  

కాగా, ఇదే సిరీస్‌లో బంగ్లాదేశ్‌ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్‌ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి 35 బంతుల్లో 80 పరుగులు సాధించాడు. వీరూ సాధించిన 80 పరుగుల్లో 70 పరగులు బౌండరీలు, సిక్సర్ల రూపంలో సాధించినవే. సెహ్వాగ్‌కు సచిన్‌ (26 బంతుల్లో 33; 5 ఫోర్లు) దూకుడు కూడా తోడవడంతో ఈ మ్యాచ్‌లో భారత్‌.. బంగ్లాదేశ్‌పై 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆతరువాత ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇర్ఫాన్‌ పఠాన్‌ కూడా ఇదే రీతిలో బౌండరీలు, సిక్సర్లతో చెలరేగిపోయి 34 బంతుల్లో 61 పరుగులతో విజృంభించాడు. ఇందులో 4 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో మాత్రం భారత్‌ విజయం ముంగిట ఆగిపోయింది. తాజాగా దక్షిణఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్‌, యువరాజ్‌లు చెలరేగిపోయి భారత అభిమానులకు పూర్వపు రోజులను గుర్తు చేస్తూ కనువిందు చేశారు.
 

>
మరిన్ని వార్తలు