ఇటు శ్రీశాంత్‌... అటు యువీ

16 Dec, 2020 08:06 IST|Sakshi

ముస్తాక్‌ అలీ టి20 ట్రోఫీ ప్రాబబుల్స్‌లో చోటు

న్యూఢిల్లీ : స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడి ఏడేళ్ల పాటు క్రికెట్‌కు దూరమైన పేస్‌ బౌలర్‌ ఎస్‌. శ్రీశాంత్‌ తొలిసారి ప్రధాన స్రవంతిలోకి అడుగు పెట్టేందుకు చేరువ య్యాడు. ముస్తాక్‌ అలీ టి20 ట్రోఫీ కోసం కేరళ జట్టు ప్రకటించిన ప్రాబబుల్స్‌లో శ్రీశాంత్‌కు చోటు దక్కింది. ఇటీవలే నిషేధం ముగియడంతో 38 ఏళ్ల శ్రీశాంత్‌ ప్రాక్టీస్‌ ప్రారంభించాడు. 2013 ఐపీఎల్‌లో అతను తన చివరి మ్యాచ్‌ ఆడాడు. ఇదే టోర్నీ కోసం పంజాబ్‌ ప్రకటించిన ప్రాబబుల్స్‌లో సీనియర్‌ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ను కూడా ఎంపిక చేశారు. గత ఏడాది జూన్‌లో యువీ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. యువీ అధికారికంగా ‘రిటైర్‌’ అయ్యాడు కాబట్టి కెనడా గ్లోబల్‌ టి20 లీగ్, అబుదాబి టి10 టోర్నీలో కూడా ఆడేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చింది. ఇప్పుడు యువీ మళ్లీ ఆడాలంటే బీసీసీఐ అనుమతి తప్పనిసరి. మరోవైపు బెంగాల్‌ జట్టు ప్రకటించిన ప్రాబబుల్స్‌లో అవకాశం దక్కించుకున్న ఆల్‌రౌండర్‌ మొహమ్మద్‌ కైఫ్‌... భారత పేసర్‌ షమీ తమ్ముడు కావడం విశేషం.

క్వాలిఫయర్‌తో భారత్‌ తొలి పోరు


దుబాయ్ ‌:
న్యూజిలాండ్‌ వేదికగా 2022 ఫిబ్రవరి–మార్చిలో జరిగే మహిళల వన్డే క్రికెట్‌ ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేశారు. 8 జట్ల మధ్య రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో జరిగే ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌ తమ తొలి పోరును మార్చి 6న క్వాలిఫయర్‌తో ఆడనుంది. ఆ తర్వాత భారత్‌ వరుసగా న్యూజిలాండ్‌ (మార్చి 10న), క్వాలిఫయర్‌ (మార్చి 12న), ఇంగ్లండ్‌ (మార్చి 16న), ఆస్ట్రేలియా (మార్చి 19న), క్వాలిఫయర్‌ (మార్చి 22న), దక్షిణాఫ్రికా (మార్చి 27న) జట్లతో తలపడుతుంది.

మరిన్ని వార్తలు