గెలిపిస్తే బాగుండేది..కానీ పవర్‌ గేమ్‌ అదిరింది!

9 Nov, 2020 16:35 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓడిపోయినా ఆ జట్టు తుది వరకూ చేసిన పోరాటం ఆకట్టుకుంది. ప్రధానంగా కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఆరెంజ్‌ ఆర్మీ  ఓదశలో గెలుపు దిశగా పయనించింది. కేన్‌ విలియమ్సన్‌-అబ్దుల్‌ సామద్‌లు ఆడుతున్నంతసేపు మ్యాచ్‌ సన్‌రైజర్స్‌ వైపే మొగ్గింది.  కానీ విలియమ్సన్‌ (45 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 67 పరుగులు) ,సామద్‌ (16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33 పరుగులు) స్వల్ప వ్యవధిలో ఔటైన తర్వాత  సన్‌రైజర్స్‌ వెనుకబడిపోయింది. ఆ క్రమంలోనే ఢిల్లీ తిరిగి పుంజుకుని ఫైనల్‌కు అడుగుపెట్టింది. (ఆసీస్‌ టూర్‌కు వరుణ్‌ దూరం! సెలక్టర్లపై విమర్శలు)

కాగా, జమ్మూ కశ్మీర్‌ ఆటగాడైన సామద్‌పై టీమిండియా మాజీ క్రికెటర్లు యువరాజ్‌ సింగ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌లు ప్రశంసలు కురిపించారు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను సామద్‌ గెలిపిస్తే బాగుండేది.. కానీ అతను పోరాడిన తీరు ఆకట్టుకుంది. ప్రత్యేకంగా సామద్‌ పవర్‌ గేమ్‌ అదిరింది’ అని ఇర్ఫాన్‌ కొనియాడాడు. ఇక ఇర్ఫాన్‌ ట్వీట్‌కు యువరాజ్‌ రిప్లై ఇస్తూ..‘ అతనిలో సత్తా ఏమిటో తెలిసింది. భవిష్యత్తులో అతనొక స్పెషల్‌ ప్లేయర్‌గా ఎదుగుతాడు’ అని ప్రశంసించాడు.

ఆదివారం ఇక్కడ జరిగిన క్వాలిఫయర్‌-2లో సన్‌రైజర్స్‌ పోరాడి ఓడింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ 17 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ను ఓడించింది. దాంతో సన్‌రైజర్స్‌ ఇంటిముఖం పట్టగా, ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలిసారి ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.  శిఖర్‌ ధావన్‌(78; 50 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్స్‌లు), స్టోయినిస్‌(38; 27 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్‌)లు మంచి ఓపెనింగ్‌ భాగస్వామ్యంతో పాటు హెట్‌మెయిర్‌( 42 నాటౌట్‌; 22 బంతుల్లో 4 ఫోర్లు,  1 సిక్స్‌) బ్యాట్‌ ఝుళిపించాడు. అనంతరం టార్గెట్‌ను ఛేదించడానికి బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ నిర్ణీత ఓవర్లలో సన్‌రైజర్స్‌ 8 వికెట్ల నష్టానికి 172పరుగులకే పరిమితం కావడంతో ఓటమి పాలైంది. 

మరిన్ని వార్తలు