వద్దు భాయ్; తేవటియాకు యువీ థాంక్స్‌!

28 Sep, 2020 13:22 IST|Sakshi

న్యూఢిల్లీ: సిక్సర్ల మోత మోగించిన రాజస్తాన్‌ రాయల్స్‌ ‘హీరో’ రాహుల్‌ తేవటియాకు టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ ధన్యవాదాలు తెలిపాడు. ఆ ఒక్క బంతి మిస్‌ చేసినందుకు.. థ్యాంక్స్‌ అంటూ సరదాగా ట్వీట్‌ చేశాడు. ఐపీఎల్‌ -2020లో భాగంగా కింగ్స్‌ పంజాబ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌  అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆఖరిదాకా ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో 224 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఆర్‌ఆర్‌ మరో విక్టరీని తన ఖాతాలో వేసుకుంది. కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌(50; 27 బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్స్‌లు), సంజూ శాంసన్‌(85; 42 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు), రాహుల్‌ తేవటియా( 53; 31 బంతుల్లో 7 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించారు. (చదవండి: అత్యంత చెత్త బంతులు అవే: తేవటియా)

అయితే ఈ మ్యాచ్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన తేవటియా తొలుత పరుగులు తీసేందుకు ఆపసోపాలు పడినా, శాంసర్‌ ఔటైన తర్వాత ఒక్కసారిగా సిక్సర్లతో చెలరేగిపోయాడు. కాట్రెల్‌ వేసిన18వ ఓవర్‌లో ఐదు సిక్స్‌లు కొట్టి ఔరా అనిపించాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్‌ఆర్‌ విజయంపై స్పందించిన యువీ.. జట్టుకు శుభాభినందనలు తెలిపాడు. సంజూ శాంసన్‌, మయాంక్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడారంటూ కొనియాడాడు. 

ఇక ఒకే ఓవర్‌లో 5 సిక్స్‌లు బాది..  ‘సిక్సర్ల’రికార్డును బద్దలు కొట్టేలా దూకుడుగా ఆడిన తేవటియాకు మాత్రం కృతజ్ఞతలు తెలిపాడు. ‘‘మిస్టర్‌ రాహుల్‌ తేవటియా.. వద్దు భాయ్‌ వద్దు.. ఆ ఒక్క బంతి వదిలేసినందుకు ధన్యవాదాలు!’’అని సరదాగా వ్యాఖ్యానించాడు. కాగా 2007 టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీలో భాగంగా స్టువర్ట్‌ బ్రాడ్‌(ఇంగ్లండ్‌) బౌలింగ్‌లో యువీ వరుసగా ఆరు సిక్సర్లు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ఆదివారం నాటి మ్యాచ్‌లో తేవటియా 31 బంతుల్లో 53 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సిక్స్‌లు ఉన్నాయి. (చదవండి: పాంటింగ్‌ వ్యంగ్య వ్యాఖ్యతో పెరిగిన కసి)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు