బ్రో.. డీఆర్‌ఎస్‌ను మరచిపోయావా?

9 Nov, 2020 17:49 IST|Sakshi

న్యూఢిల్లీ:  ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ను ఒకవైపు పొగుడుతూనే మరొకవైపు ట్రోల్‌ చేశాడు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌. ధావన్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు.. కానీ మనోడికి డీఆర్‌ఎస్‌ను కోరకుండా వెళ్లిపోవడం అలవాటుగా మారిపోయింది అంటూ సెటైర్‌ వేశాడు. ఆదివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయర్‌-2లో ఢిల్లీ విజయం సాధించి ఫైనల్‌కు చేరింది.  ఫలితంగా ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి ఢిల్లీ ఫైనల్‌కు చేరినట్లయ్యింది. కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోర్ చేయడంలో శిఖర్‌ ధావన్‌ కీలక పాత్ర పోషించాడు.(అతన్ని వేలంలో ఎవరూ తీసుకోలేదు: గంభీర్‌)

ఇన్నింగ్స్ ఆరంభం నుంచే సన్‌రైజర్స్‌ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. హాఫ్ సెంచరీ అనంతరం 19వ ఓవర్‌లో ధావన్‌  ఔటయ్యాడు. పేసర్ సందీప్‌ శర్మ వేసిన 18వ ఓవర్ మూడో బంతికి ధావన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అయితే అంపైర్‌ ఔటివ్వకముందే.. అతడు దాదాపు క్రీజ్‌ను వదలడానికి సిద్ధమై పోయాడు. కానీ రీప్లేలో ఆ బంతి ఆఫ్‌స్టంప్‌ అవతలికి వెళ్లినట్లు తేలింది.శిఖర్ ధావన్‌ కనీసం డీఆర్‌ఎస్‌కు వెళ్లకపోవడం టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్ సింగ్‌‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో గబ్బర్‌ను ఉద్దేశించి యువీ ట్విటర్‌లో ట్రోల్‌ చేశాడు.(గెలిపిస్తే బాగుండేది..కానీ పవర్‌ గేమ్‌ అదిరింది!)

'ఢిల్లీ ఇన్నింగ్స్‌లో చివరి రెండు ఓవర్లలో హైదరాబాద్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ఆఖరి రెండు ఓవర్లలో నటరాజన్‌, సందీప్‌ శర్మ ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదు. ఒత్తిడిని తట్టుకుని బాగా బౌలింగ్ చేశారు. శిఖర్ ధావన్‌ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. కానీ ఎప్పటిలాగే డీఆర్‌ఎస్‌ కోరడం మర్చిపోయావా బ్రో’ అంటూ యువీ ఆటపట్టించాడు. ఈ సీజన్‌లో అతను 16 మ్యాచ్‌లు ఆడి 603 పరుగులు చేశాడు. 2012లో ధావన్‌ అత్యధికంగా 569 పరుగులు సాధించిన అతని రికార్డును సవరించుకున్నాడు.

నిన్నటి మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 189 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ (78; 50 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. ఆపై  భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వార్నర్‌సేన 8 వికెట్లు కోల్పోయి 172 పరుగులకే పరిమితమైంది. రేపు(మంగళవారం) ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ టైటిల్‌ పోరులో తలపడనుంది. ఇరుజట్ల మధ్య జరిగిన తొలి క్వాలిఫయర్‌లో ముంబై ఇండియన్స్‌ విజయం సాధించి ముందుగానే ఫైనల్‌ బెర్తును ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు