Yuzvendra Chahal: 'ఐదేళ్లలో ఒక్కసారి కూడా చోటు కోల్పోలేదు.. ఆరోజు మాత్రం'

5 Feb, 2022 20:28 IST|Sakshi

టి20 ప్రపంచకప్‌ 2021కు తనను ఎంపిక చేయకపోవడం చాలా బాధ కలిగించిందని టీమిండియా స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ పేర్కొన్నాడు. విండీస్‌తో వన్డే సిరీస్‌కు సిద్ధమైన టీమిండియా జట్టులో చహల్‌ చోటు దక్కించుకున్నాడు.  ఈ సందర్భంగా ప్రాక్టీస్‌ సమయంలో ఆర్‌సీబీ పాడ్‌కాస్ట్‌తో చహల్‌ మాట్లాడాడు.

''టి20 ప్రపంచకప్‌కు సంబంధించి టీమిండియా జట్టును ప్రకటించే రోజు అది. ఉదయం 9:30 గంటల సమయంలో జట్టును ప్రకటిస్తామన్నారు. కానీ కాస్త లేట్‌ అయింది. అప్పటివరకు నా పేరు జట్టులో ఉంటుందని బాగా నమ్మాను. కానీ లిస్ట్‌ బయటికి వచ్చాకా గట్టిషాక్‌ తగిలింది. దీంతో కొన్ని నిమిషాల పాటు ఎవరితో ఏం మాట్లాడకుండా ఉండిపోయాను. కొద్దిసేపటి తర్వాత నా భార్య విషయం ప్రస్తావించింది. లిస్ట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఆమెకు పంపాను.  ఆరోజు రాత్రి ఏమి తినకుండా ఆలోచిస్తూ కూర్చుండిపోయా. అంతకముందు ఐదేళ్లలో ఒక్కసారి కూడా టీమిండియాలో చోటు కోల్పోలేదు.. ఎందుకిలా అని ఆలోచించాను'' అంటూ చెప్పుకొచ్చాడు.

చదవండి: PSL 2022: ఔటయ్యాడని తెగ ఫీలైపోయింది.. ఆరా తీస్తే

ఇక ఐపీఎల్‌ మెగావేలం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. ఐపీఎల్‌లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలవాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు పేర్కొన్నాడు. ఇక టీమిండియాకు మరో 5-6 సంవత్సరాల పాటు ఆడాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. కాగా ఐపీఎల్‌లో ఆర్‌బీకీ ఆడిన చహల్‌ను ఆ జట్టు రిలీజ్‌ చేసింది. ఫిబ్రవరి 12,13 తేదీల్లో జరగనున్న వేలంలో చహల్‌ను ఏ జట్టు సొంతం చేసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఐపీఎల్‌లో చహల్‌ 114 మ్యాచ్‌ల్లో 139 వికెట్లు తీశాడు.

కాగా టి20 ప్రపంచకప్‌లో చహల్‌ స్థానంలో రాహుల్‌ చహర్‌ను ఎంపిచేశారు. ఇక టీమిండియా టి20 ప్రపంచకప్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయింది. పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ చేతిలో ఓడిన భారత్‌.. తర్వాతి మ్యాచ్‌లను గెలిచినప్పటికి సూపర్‌-12 దశలోనే వెనుదిరిగింది.

చదవండి: టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు అవసరమంటున్న భారత మాజీ బౌలర్‌ 

>
మరిన్ని వార్తలు