పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు కొత్త బాస్‌ ఎవరంటే..?

20 Jun, 2023 17:34 IST|Sakshi

త్వరలో జరుగనున్న పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఛైర్మన్‌ ఎన్నికల బరి నుంచి తాత్కాలిక బాస్‌ నజమ్‌ సేథి వైదొలగడంతో కొత్త అభ్యర్థిగా మాజీ పీసీబీ అధ్యక్షుడు జకా అష్రాఫ్‌ పేరును ప్రకటించారు పాక్‌ ఫెడరల్‌ మంత్రి ఎహసాన్‌ మజారి. ఛైర్మన్‌గా నజమ్‌ సేథి పదవీకాలం రేపటితో (జూన్‌ 21) ముగియనుండటంతో అష్రాఫ్‌ను బరిలోకి దించింది పాక్‌ ప్రభుత్వం. అష్రాఫ్‌ 2011-13 మధ్యకాలంలో పీసీబీ ఛైర్మన్‌గా పని చేశారు.

పాకిస్తాన్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి, ఆసియా కప్‌, భారత్‌లో జరుగనున్న వన్డే వరల్డ్‌కప్‌ లొల్లి నేపథ్యంలో నజమ్‌ సేథి అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు అతను ట్విటర్‌ వేదికగా వర్తమానం పంపాడు. కాగా, గతేడాది డిసెంబర్‌లో పాక్‌ ప్రధాని షాబాజ్‌.. షరీఫ్‌ రమీజ్‌ రజాను పీసీబీ ఛైర్మన్‌ పదవి నుంచి తప్పించి, తాత్కాలిక ఛైర్మన్‌ నజమ్‌ సేథిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

ఈ ఆరు నెలల కాలంలో నజమ్‌ సేథీ పీసీబీలోని 14 మందితో కూడిన కమిటీని సమర్థంగా నడిపించాడు. కొన్ని కీలక నిర్ణయాలతో తన మార్కును చూపించాడు. మికీ ఆర్థర్‌ను డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌గా, గ్రాంట్‌  బ్రాడ్‌బర్న్‌  హెడ్‌కోచ్‌గా, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్‌ మోర్నీ మోర్కెల్‌ను బౌలింగ్‌ కోచ్‌గా ఎంపిక చేయడంలో కీలకపాత్ర పోషించాడు.

అలాగే ఆసియా కప్‌ను‌ హైబ్రీడ్‌ మోడ్‌లో నిర్వహించే ప్రతిపాదనను తెరపైకి తెచ్చాడు. ఏసీసీని ఒప్పించి ఆసియా కప్ ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించాడు. అయితే, భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌లో పాక్‌ పాల్గొనడంపై జరుగుతున్న రచ్చ నేపథ్యంలో నజమ్‌ సేథి అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకున్నాడు. 

మరిన్ని వార్తలు