Aus Vs Zim 3rd ODI: సొంతగడ్డపై ఆస్ట్రేలియాను మట్టికరిపించిన జింబాబ్వే.. సంచలన విజయం

3 Sep, 2022 10:59 IST|Sakshi
ఆస్ట్రేలియా మీద జింబాబ్వే సంచలన విజయం(PC: Zimbabwe Cricket)

Zimbabwe Tour of Australia, 2022- 3rd ODI: ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో జింబాబ్వే సంచలన విజయం సాధించింది. మూడు వికెట్ల తేడాతో ఆతిథ్య కంగారూలను ఓడించి భారీ షాక్‌ ఇచ్చింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌లో ఆసీస్‌ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించి క్లీన్‌స్వీప్‌ నుంచి తప్పించుకుంది. కాగా ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌కప్‌ సూపర్‌ లీగ్‌లో భాగంగా మూడు వన్డేలు ఆడేందుకు జింబాబ్వే.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది.

మొదటి రెండు మ్యాచ్‌లలో అలవోకగానే!
మొదటి రెండు మ్యాచ్‌లలో ఆరోన్‌ ఫించ్‌ బృందం పర్యాటక జింబాబ్వే మీద వరుసగా 5, 8 వికెట్ల తేడాతో ఏకపక్ష విజయాలు సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇక నామమాత్రపు మూడో వన్డేలోనూ నెగ్గి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని భావించింది. అయితే, అనూహ్య రీతిలో రెగిస్‌ చకబ్వా బృందం ఆసీస్‌కు షాకిచ్చింది.

బర్ల్‌ దెబ్బకు కుప్పకూలిన ఆసీస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌
టౌన్స్‌విల్లే వేదికగా శనివారం జరిగిన మూడో వన్డేలో టాస్‌ గెలిచిన జింబాబ్వే తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. రియాన్‌ బర్ల్‌ 5 వికెట్లతో చెలరేగిన నేపథ్యంలో 31 ఓవర్లలోనే కంగారూల ఆట ముగిసింది. 141 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఇందులో 94 పరుగులు ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ చేసినవే!

రాణించిన మారుమని.. చకబ్వా కెప్టెన్‌ ఇన్నింగ్స్‌
లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వేకు ఓపెనర్‌ తాడివానాషే మారుమని 35 పరుగులతో శుభారంభం అందించాడు. ఇక వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన వేళ ఆరో స్థానంలో బరిలోకి దిగిన కెప్టెన్‌ రెగిస్‌ చకబ్వా 37 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.

రియాన్‌ బర్ల్‌ సైతం ఆఖర్లో విలువైన ఇన్నింగ్స్‌ ఆడి (11 పరుగులు) కెప్టెన్‌కు సహకారం అందించాడు. ఈ క్రమంలో 39 ఓవర్లలో 7 వికెట్ల నస్టానికి 142 పరుగులు చేసిన జింబాబ్వే.. ఆతిథ్య ఆసీస్‌ మీద అద్బుత విజయం సాధించింది. రియాన్‌ బర్ల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

చదవండి: Asia Cup 2022: మరోసారి తలపడనున్న భారత్‌-పాక్‌.. సూపర్‌-4 షెడ్యూల్‌ ఇదే
Asia cup 2022: భారత్‌ రికార్డు బద్దలు కొట్టిన పాకిస్తాన్‌.. ప్రపంచంలోనే రెండో జట్టుగా!

మరిన్ని వార్తలు