చెలరేగిన బంగ్లా బ్యాట్స్‌మెన్.. తొలి టీ20లో జింబాబ్వేపై గెలుపు

22 Jul, 2021 21:16 IST|Sakshi

హరారే: జింబాబ్వే గడ్డపై బంగ్లాదేశ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన బంగ్లా జట్టు.. మూడు టీ20ల సిరీస్‌లోను బోణీ కొట్టింది. గురువారం జరిగిన తొలి టీ20లో ఆల్‌రౌండ్ షోతో సత్తాచాటిన బంగ్లా.. 8 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 19 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రెగిస్ చకబ్వా(22 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), డియోన్ మైర్స్(22 బంతుల్లో 35; 2 ఫోర్లు) రాణించారు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్(3/31) మూడు వికెట్లతో చెలరేగగా.. సైఫుద్దీన్(2/23), షోరిఫుల్ ఇస్లామ్(2/17) చెరో రెండేసి వికెట్లు పడగొట్టారు. సౌమ్య సర్కార్, షకీబ్ అల్ హసన్‌లకు తలో వికెట్‌ దక్కింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లా జట్టు ఆడుతూ పాడుతూ 18.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్లు మహమ్మద్ నైమ్(51 బంతుల్లో 63 నాటౌట్; 6 ఫోర్లు), సౌమ్య సర్కార్(45 బంతుల్లో 50; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే బౌలర్లు ఒక్క వికెట్ తీయలేకపోవడం గమనార్హం. బంగ్లా రెండు వికెట్లు కూడా రనౌట్‌ల రూపంలోనే కోల్పోయింది. ఇక వికెట్‌తో పాటు హాఫ్ సెంచరీ సాధించిన సౌమ్య సర్కార్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఇదే వేదికగా శుక్రవారం జరగనుంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు