Zim Vs IRE: చెలరేగిన జింబాబ్వే బౌలర్లు.. పటిష్ట జట్లపై ఆడిన బ్యాటర్లకు చుక్కలు! గెలుపుతో

13 Jan, 2023 11:25 IST|Sakshi

Zimbabwe vs Ireland, 1st T20I: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో జింబాబ్వే శుభారంభం చేసింది. హరారే వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మూడు టీ20, మూడు వన్డేల సిరీస్‌ కోసం ఐర్లాండ్‌.. జింబాబ్వే పర్యటనకు వెళ్లింది.

ఇందులో భాగంగా హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో గురువారం మొదటి టీ20 జరిగింది. టాస్‌ గెలిచిన జింబాబ్వే తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. కెప్టెన్‌ క్రెయిగ్‌ ఎర్విన్‌ టాస్‌ ఛాయిస్‌కు సార్థకత చేకూరేలా ఆతిథ్య జట్టు బౌలర్లు.. ఐర్లాండ్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించారు.

ర్యాన్‌ బర్ల్‌ మూడు వికెట్లు కూల్చగా.. చటారా, నగరవ, మసకద్జ రెండేసి వికెట్లు తీశారు. బ్రాడ్‌ ఎవాన్స్‌కు ఒక వికెట్‌ దక్కింది. టీమిండియా వంటి పటిష్ట జట్లపై మెరుగ్గా ఆడగలిగిన ఐరిష్‌ కెప్టెన్‌ బల్బిర్నీ(5), హ్యారీ టెక్టార్‌(5) వంటి కీలక బ్యాటర్లు విఫలం కావడం తీవ్ర ప్రభావం చూపింది.

ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌లో 24 పరుగులతో డెలని టాప్‌ స్కోరర్‌ అనిపించుకున్నాడు. ఇలా జింబాబ్వే బౌలర్ల ధాటికి బ్యాటర్లు చేతులెత్తేయడంతో 19.2 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి ఐర్లాండ్‌ 114 పరుగులు మాత్రమే చేయగలిగింది.

అయితే, స్వల్ప లక్ష్యంతో ఛేదనకు దిగినప్పటికీ జింబాబ్వే విజయం కోసం చివరి వరకు పోరాడాల్సి వచ్చింది. ఓపెనింగ్‌ జోడీ ఎర్విన్, మరునణి చెరో నాలుగు పరుగులు చేసి పెవిలియన్‌ చేరారు. వన్డౌన్‌లో మధెవెరె 16 పరుగులకు అవుటయ్యాడు. 

టాపార్డర్‌ విఫలమైన వేళ నాలుగో స్థానంలో వచ్చిన గ్యారీ బ్యాలన్స్‌ 30 పరుగులు చేయగా , సీన్‌ విలియమ్స్‌(34) పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసిన జింబాబ్వే జయకేతనం ఎగురవేసింది. 

చదవండి: దంచికొట్టిన సాల్ట్‌! సన్‌రైజర్స్‌కు తొలి మ్యాచ్‌లోనే చేదు అనుభవం
Rashid Khan: రషీద్‌ ఖాన్‌ సంచలన నిర్ణయం!

మరిన్ని వార్తలు