ZIM VS NED 2nd ODI: జింబాబ్వే బౌలర్‌ హ్యాట్రిక్‌.. ఉత్కంఠ సమరంలో పరుగు తేడాతో విజయం 

23 Mar, 2023 20:47 IST|Sakshi

స్వదేశంలో నెదర్లాండ్స్‌తో జరుగుతున్న 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను జింబాబ్వే 1-1తో సమం చేసింది. తొలి వన్డేలో పర్యాటక నెదర్లాండ్స్‌.. తమ కంటే మెరుగైన జింబాబ్వేపై సంచలన విజయం సాధించగా, ఇవాళ (మార్చి 23) జరిగిన రెండో వన్డేలో జింబాబ్వే.. పసికూన నెదర్లాండ్స్‌ను చిత్తు చేసి తొలి మ్యాచ్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది.

ఆఖరి బంతి వరకు ఉ‍త్కంఠభరితంగా సాగిన ఈ సమరంలో జింబాబ్వే పరుగు తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లోనూ గెలుపు దిశగా సాగుతున్న నెదర్లాండ్స్‌ను జింబాబ్వే స్పిన్‌ ఆల్‌రౌండర్‌ వెస్లీ మదెవెరె హ్యాట్రిక్‌ వికెట్లు పడగొట్టి కట్టడి చేశాడు. నెదర్లాండ్స్‌ గెలుపు దిశగా సాగుతుండగా (272 పరుగుల లక్ష్య ఛేదనలో 42 బంతుల్లో 59 పరుగులు, చేతిలో 7 వికెట్లు).. 44వ ఓవర్‌లో బంతినందుకున్న మదెవెరె తొలి 3 బంతులకు 3 వికెట్లు తీసి, ప్రత్యర్ధిని దారుణంగా దెబ్బకొట్టాడు.  

ఈ దెబ్బతో సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. నెదర్లాండ్స్‌ గెలవాలంటే 39 బంతుల్లో 59 పరుగులు చేయాల్సి వచ్చింది. చేతిలో 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి. అయినా ఏ మాత్రం తగ్గని నెదర్లాండ్స్‌ అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి మ్యాచ్‌ను ఆఖరి బంతి వరకు తీసుకువచ్చింది. ఆఖరి ఓవర్‌లో నెదర్లాండ్స్‌ గెలుపుకు 19 పరుగులు అవసరం కాగా (చేతిలో ఒక్క వికెట్‌ మాత్రమే ఉంది).. ర్యాన్‌ క్లెయిన్‌, క్లాసెన్‌ అద్భుతంగా పోరాడి 17 పరుగులు పిండుకున్నారు. ఆఖరి బంతికి బౌండరీ సాధించాల్సి ఉండగా..ర్యాన్‌ 2 పరుగులు తీసి రనౌట్‌ కావడంతో జింబాబ్వే పరుగు తేడాతో బయటపడింది.

అగ్రశ్రేణి జట్ల పోరాటాన్ని తలపించిన ఈ మ్యాచ్‌ ప్రేక్షకులకు అసలుసిసలైన క్రికెట్‌ మజాను అందించింది. మదెవెరె హ్యాట్రిక్‌ విషయానికొస్తే.. తొలి బంతికి ఆకెర్‌మన్‌ స్టంపౌట్‌ కాగా, ఆతర్వాత బంతికి తెలుగబ్బాయి నిడమనూరు తేజను, ఆమరుసటి బంతికి వాన్‌ మీకెరెన్‌ను మదెవెరె క్లీన్‌ బౌల్డ్‌ చేసి హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే మార్చి 25న జరుగుతుంది.  

మరిన్ని వార్తలు